- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దశాబ్దాలుగా ఆధిపత్య పోరు.. మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్
మంత్రి పదవి కోసం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొత్త రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పార్టీలోని రాష్ట్ర, జిల్లా కీలక నేతలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ నడుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి పదవి కోసం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొత్త రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పార్టీలోని రాష్ట్ర, జిల్లా కీలక నేతలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ నడుస్తున్నది. గత నెల మూడో తేదీన మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరిగింది. ప్రమాణస్వీకారమే తరువాయి అనే సమయంలో కేబినెట్ విస్తరణ వాయిదా పడడంతో రాజగోపాల్ రెడ్డి అనుచరులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని భావిస్తున్న ఆయన.. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా కీలక నేతలను మచ్చిక చేసుకునేందుకు కొత్త ఎత్తుగడులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన కామెంట్లు సరికొత్త చర్చకు దారితీశాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందని ఆయన బహిరంగంగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను ఇటీవల ఒక కార్యక్రమానికి ఆహ్వానించి తనపట్ల సానుకూలంగా వ్యవహరించే విధంగా చేశారనే చర్చ జరుగుతున్నది.
ఆధిపత్య పోరు ఉన్నా..
ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ సంబంధాలు అంతంత మాత్రమే. నల్లగొండ జిల్లాలో దశాబ్దాలుగా వారి మధ్య ఆధిపత్యపోరు నడుస్తుందనే చర్చ ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన అండదండలతో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగింది. ఆ తర్వాత ఉత్తమ్ పీసీసీ చీఫ్ అయ్యారు. ఏఐసీసీ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాన్ని సైతం పరిగణలోకి తీసుకుంటుందని రాజగోపాల్ రెడ్డి భావించారని.. అందులో భాగంగానే ఉత్తమ్‌ను పొగుడుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరొక కార్యక్రమంలోనూ మంత్రి కోమటిరెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ టైగర్ అని చెప్పారు. ‘నన్ను ఎందుకు టైగర్ అంటావు.. నీవు టైగర్’ అంటూ మంత్రి కోమటిరెడ్డి సైతం ఉత్తమ్‌ను పొగిడారు.
‘గుత్తా’ను కలుపుకొని పోయేలా..
నల్లగొండ జిల్లాలో గుత్తా, కోమటిరెడ్డి కుటుంబాలకు సైతం ఎప్పుడూ ఉప్పు, నిప్పులాగా ఉంటుంది. గుత్తా సుఖేందర్ రెడ్డిని కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యక్తిగతంగా దూషించిన సందర్భాలు అనేకం. గుత్తా కాంగ్రెస్‌లో ఉన్న సందర్భంలోనూ ఇదే ఒరవడి కొనసాగింది. అయితే తాజాగా గుత్తానూ కలుపుకొనిపోవాలని రాజగోపాల్ రెడ్డి భావించినట్టు ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతున్నది. అందుకోసమే ఇటీవల ఒక కార్యక్రమానికి గుత్తా, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను రాజగోపాల్ రెడ్డి స్వయంగా పిలిచినట్టు తెలిసింది. అంతేకాకుండా తన పట్ల వారు సానుకూలంగా స్పందించే విధంగా, ఎక్కడా అడ్డుపడకుండా, వేరే రకంగా చర్చకు దారి తీయకుండా వ్యవహరించినట్టు తెలిసింది. అందరితో మంచిగా ఉండడం ద్వారా రాబోయే రోజుల్లో మంత్రి పదవి రావడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవనే ఉద్దేశంతోనే ఇలాంటి రాజకీయ ఎత్తుగడలను అమలు చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది.
పదవిపై ధీమా
జిల్లాలో ఇప్పటికే వెంకట్‌రెడ్డికి మంత్రి పదవి ఉన్నందున, తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి సైతం మంత్రి పదవా? అంటూ కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇద్దరు రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చారని, మరొక రెడ్డికీ ఇదే జిల్లా నుంచి మంత్రి పదవి ఇస్తారా? అని రకరకాలుగా స్పందిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవిపై ధీమాతోనే కనిపిస్తున్నారు. తాను పార్టీలో చేరినప్పుడే అన్నదమ్ములు, రెడ్డి సామాజికవర్గం అనే అంశాలు చర్చకు వచ్చాయని, వాటన్నింటిపై డిస్కషన్ జరిగిన తర్వాతే తనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చారని ముఖ్య అనుచరులకు రాజగోపాల్ రెడ్డి చెబుతున్నట్టు తెలిసింది. భువనగిరి ఎంపీ సీటు గెలిపించుకొని రావాలని, ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తామని చెప్పారని గుర్తు చేస్తున్నారు. అధిష్టానం విషయంలో ఎలాంటి సందేహం లేదని, స్థానికంగా మాత్రమే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని రాజగోపాల్ రెడ్డి తన ముఖ్య అనుచరుల వద్ద చెబుతున్నట్టు సమాచారం.






