సీఎం రేవంత్ రెడ్డి సభకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డుమ్మా

by Malleboina Mahesh |

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలకపాన్పు, సీఎం రేవంత్ రెడ్డి సభకు డుమ్మా కొట్టడం తీవ్ర చర్చకు దారీతీసింది.

సీఎం రేవంత్ రెడ్డి సభకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డుమ్మా
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలకపాన్పు ఎక్కినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ఆ అలక సొంత అన్న వెంకట్ రెడ్డిపైననా? లేక ఇచ్చిన మాట నిలబెట్టుకోని కాంగ్రెస్ అధిష్టానం పైన? అని చర్చ జరుగుతున్నది. వెంకట్ రెడ్డి శాఖకు చెందిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు. వేదికపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లీడర్లు అందరూ ఉన్నారు కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం దూరంగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. పైగా ఆయన వెళ్లకుండా ఉండటం తో పాటు తన నియోజకవర్గానికి చెందిన లీడర్లు, కేడర్ ఎవరూ మీటింగ్ కు వెళ్లొద్దని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతున్నది.

అందుకేనా డుమ్మా?

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులు జరిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ జిల్లా, కులసమీకరణ నేపథ్యంలో తన సొంత సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఆయనకు మాత్రం మొండిచేయి చూపారు. తనకు ఇచ్చిన హామీ ఏమైందని రాజగోపాల్ రెడ్డి పలుసార్లు ఢిల్లీ పెద్దలను కలిశారు. కలిసిన ప్రతిసారీ ‘అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తాం’ అంటూ నాన్చుతున్నారే తప్ప విస్తరణ మాత్రం చేపట్టడం లేదు. కాగా, ఇటీవల నేరుగా రాహుల్ గాంధీని కలిసి వచ్చారు. భేటీ సందర్భంగా ఆయన రాజగోపాల్ రెడ్డికి ఏం హామీ ఇచ్చారో మాత్రం బయటికి రాలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీచేస్తారో లేదోనని అయోమయం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి పదవి వస్తుందన్న గ్యారెంటీ రాజగోపాల్ రెడ్డికి లేదని, అందుకే అధిష్టానానికి తనలో ఉన్న అసంతృప్తిని చూపించేందుకే సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ కు వెళ్లలేదని ప్రచారం జరుగుతున్నది.

అన్న పై అక్కసు!

గత ఏడాది జూన్ లో జరిగిన విస్తరణలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఆ సమయంలో తనకు తప్పకుండా పదవి వస్తుందని ధీమాలో ఉన్న రాజగోపాల్ రెడ్డికి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వల్లే పదవి రావట్లేదని సంకేతాలు అధిష్టానం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఎలా ఇస్తారని సీనియర్ లీడర్లు అభ్యంతరం పెడుతున్నారని సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. అందుకోసమే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో వెంకట్ రెడ్డిని పక్కనపెట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ వెంకట్ రెడ్డి మంత్రి పదవికి బదులుగా ఏఐసీసీలో కీలక పదవి ఇవ్వాలని కండీషన్ పెట్టడంతో పీటముడి పడినట్లు టాక్ ఉంది. దీంతో అన్న వెంకట్ రెడ్డి వల్లే తనకు మంత్రి పదవి రావట్లేదని అక్కసు పెంచుకుని నల్గొండ సభకు రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారేమోనని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అసంతృప్తి రాగం

మంత్రి పదవి కోసం ఎదురుచూస్తూ విసిగిపోయిన రాజగోపాల్ రెడ్డి పలుసార్లు తనలో ఉన్న అసంతృప్తిని బహిర్గతం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పనితీరు లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గుర్తుచేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఫరవాలేదని ప్రకటనలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత సీఎం కుర్చీలో ఎవరు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుందని కామెంట్ చేశారు. ఇలా వరుసగా ప్రభుత్వ, పార్టీని పరోక్షంగా ప్రశ్నిస్తున్న రాజగోపాల్ రెడ్డి నల్గొండ సభకు వెళ్లకపోవడం, లీడర్లు, కేడర్ సైతం వెళ్లొద్దని ఆదేశాలు ఇవ్వడంతో ఆ నియోజకవర్గం నుంచి ఎవరు సభకు వెళ్లలేదు.

Next Story