అసెంబ్లీలో మైకులు కట్.. ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

by Ramesh Naini |

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో అధికార పార్టీ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర విమర్శలు చేశారు.

అసెంబ్లీలో మైకులు కట్.. ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసనసభ సమావేశాల్లో అధికార పార్టీ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పలు ఆరోపణలు గుప్పించారు. ‘రేవంత్ రెడ్డి.. నీకెందుకు అంత భయం?’ అంటూ ప్రశ్నించిన కేపీ వివేకానంద, తమ పార్టీ సభ్యులు అసెంబ్లీలో ఏదైనా అంశంపై మాట్లాడుతుండగానే మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు. అలాగే బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడే సమయంలో కెమెరాలను స్పీకర్ వైపునకు తిప్పి ప్రతిపక్ష గొంతును బయటకు వినిపించకుండా చేస్తున్నారని తెలిపారు.

అసెంబ్లీ ప్రారంభం కాకముందే డ్రామాలు

ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్లి వీడియోలు తీయించి, అసెంబ్లీ ప్రారంభం కాకముందే వాటిని విడుదల చేస్తూ రాజకీయ డ్రామాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బయట ప్రతిపక్ష నాయకుడిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు, లోపల మాత్రం డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఇన్ని రోజులుగా జరిగిన సభల్లో ప్రతిపక్షం అడిగిన ఒక్క ప్రశ్నకైనా ప్రభుత్వం సమాధానం చెప్పలేదని కేపీ వివేకానంద ఆరోపించారు.

కేసీఆర్ గొంతుకై మేము మాట్లాడతాం

‘కేసీఆర్ గొంతుకై మేము మాట్లాడతాం. తప్పులు సరిదిద్దుకుని పాలన చేయడం ఈ ప్రభుత్వానికి చేతకాదు’ అని వ్యాఖ్యానించారు. గతంలో రేవంత్ రెడ్డి ‘బీహార్ వాళ్ల చేతిలో రాష్ట్రం పెట్టారు’ అని మాట్లాడిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. శాసనసభను జీరో అవర్‌తో ప్రారంభించి కొత్త సంప్రదాయానికి తెరలేపారని విమర్శించిన కేపీ వివేకానంద, తమ పార్టీ తరఫున ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Next Story