- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజీనామాకు ఎమ్మెల్యే సిద్ధం.. తెలంగాణలో మరో ఉపఎన్నిక?
త్వరలో గ్రేటర్ హైదరాబాద్‌లో మరో ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో గ్రేటర్ హైదరాబాద్‌లో మరో ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఆయనపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పీకర్ నిర్ణయం కంటే ముందే ఆయనతో రాజీనామా చేయిస్తే హుందాగా ఉంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దానంతో ఎప్పుడు రాజీనామా చేయించాలి? అనే అంశంపై ఏఐసీసీ ఆరా తీస్తున్నట్లు టాక్.
వేటు కంటే రాజీనామా బెటర్
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగిస్తున్నారు. ఇరు పార్టీల నుంచి వాదనలు వినే ప్రక్రియ కొనసాగుతున్నది. ఈలోపే సుప్రీం కోర్టు ఇచ్చిన గడువులోపు(అక్టోబరు 31లోపు నిర్ణయం తీసుకోవాలని తీర్పు) స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించలేదని బీఆర్ఎస్ కోర్టు ధిక్కార పిటిషన్ వేసింది. దీనికి తోడు రెండు రోజుల క్రితం వెస్ట్ బెంగాల్‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్యెల్యే సభ్యత్వాన్ని అక్కడి హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై వేటు పడే అవకాశం ఉంది. అందుకే వేటు కంటే రాజీనామా బెటర్ అని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. చాలా రోజుల క్రితమే ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయాలని దానం నాగేందర్‌కు అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తీర్పు ఆధారంగా రాజీనామా అంశంపై నిర్ణయం తీసుకుందామని పెండింగ్‌లో పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలవడంతో ఖైరతాబాద్‌లోనూ బై ఎలక్షన్‌కు వెళ్లేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అయితే రాజీనామా ఎప్పుడు చేయాలనే అంశంపై ఏఐసీసీ సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.
జూబ్లీహిల్స్ రిజల్ట్ ఖైరతాబాద్‌లో రిపీట్!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ ఉనికి లేదు. అక్కడ ఉన్న లీడర్లు, కేడర్ గులాబీ పార్టీలోకి వెళ్లారు. ఆయినా బై ఎలక్షన్‌లో మంచి మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచారు. మాస్ లీడర్‌గా గుర్తింపు ఉన్న దానం నాగేందర్ రాజీనామా చేస్తే ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుందని పార్టీ వర్గాల్లో టాక్ ఉంది. ఎందుకంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కేడర్, లీడర్లు ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిచిన ఊపు ఉంది.






