మిట్టల్ సాబ్.. కొన్న భూమికి డాక్యుమెంట్లు ఎక్కడ?

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి పోర్టల్ లోపాలను ఆధారంగా చేసుకొని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు.

మిట్టల్ సాబ్.. కొన్న భూమికి డాక్యుమెంట్లు ఎక్కడ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి పోర్టల్ లోపాలను ఆధారంగా చేసుకొని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. ఎలాంటి పత్రాలు లేకుండానే ఎల్ఆర్ యూపీలో కొందరి పేర్లను రికార్డుల్లో నమోదు చేశారు. డాక్యుమెంట్లు లేని వారికేమో హక్కులు కల్పించారు. అన్నీ ఉన్నోళ్ల భూములనేమో ఖాస్రా పహానీ బూచీగా చూపించి నిషేదిత జాబితాలో నమోదు చేశారు. 2018 తర్వాత చోటు చేసుకున్న భూ అక్రమాల సంఖ్య అన్నీ ఇన్నీ కావు. ఆఖరికి సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన భూములపైనే పంచాయితీ కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూ లావాదేవీలు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. పెద్దలంతా లింక్ డాక్యుమెంట్లు వెరిఫై చేసుకోలేదని తేటతెల్లమవుతున్నది. వీళ్లకు ఎవరైతే అమ్మారో, వారు ఎవరి నుంచి కొనుగోలు చేశారో.. వారికి హక్కులు ఎట్లా వచ్చాయో? తెలిపే రికార్డులను పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేలింది.

నవీన్ మిట్టల్ హయాంలోనే..

అది కూడా భూ రికార్డుల ప్రధాన కమిషనర్‌గా నవీన్ మిట్టల్ పనిచేస్తోన్న కాలంలోనే జరిగింది. ఆయన హయాంలోనే భూ రికార్డుల ప్రక్షాళన, పాసు పుస్తకాల జారీ, అదే భూమి క్రయవిక్రయాలు చోటు చేసుకున్నాయి. సీఎస్‌గా సుదీర్ఘ కాలం పని చేసిన సోమేశ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా నాగారంలో భూమి కొనుగోలు చేశారు. ఈ జాబితాలో అనేక మంది సీనియర్ అధికారులు ఉన్నారు. వీరిని నాగారంలో ల్యాండ్స్ కొనుగోలు చేయాలని ప్రేరేపించిన లీడర్లు ఎవరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అప్పటి ప్రభుత్వంలో కీలకంగా పని చేస్తూ, ఐఏఎస్ అధికారులతో సన్నిహితంగా ఉండే వారే ఇక్కడి భూములను వీళ్లతో కొనుగోలు చేయించి ఉంటారని తెలుస్తున్నది. ఐతే నాగారం సర్వే నం.194లోని భూమి హక్కులపై గుట్టును తాజాగా మహేశ్వరం తహశీల్దార్ సైదులు హైకోర్టు ఆదేశాల మేరకు విప్పారు. అందులోనూ ట్విస్ట్ ఇస్తూ ఎండార్స్మెంట్‌ని దరఖాస్తుదారుడి ఇంటికి పంపడం గమనార్హం. అడిగింది ముగ్గురి వివరాలైతే ఇద్దరి గురించే ఇచ్చారు. ఫోర్త్ సిటీకి అత్యంత సమీపంలోని నాగారం భూముల అంశం సర్వత్రా ఆసక్తిగా మారింది.

రికార్డులు లేవన్న తహశీల్దార్.. తాజాగా కాపీ అందజేత (దిశ, ఎఫెక్ట్)

మహేశ్వరం తహశీల్దార్ ఎండార్స్మెంట్ నం.బి/244/2025 ప్రకారం మహేశ్వరం మండలం పర్మటి తండాకు చెందిన వి.రాములు దరఖాస్తు చేసుకున్నారని, డబ్ల్యూ.పి.నం.17871/2024(26.06.2025), 19065/2025(4.7.2025) ఆర్డర్స్, వడ్త్యా రాములు దరఖాస్తులు(3.7.2025, 10.7.2025) రెఫరెన్స్‌‌గా పేర్కొన్నారు. పాస్‌బుక్ టి05160040235లో నాగారం సర్వే నం.194/జ/1లోని 9.00 ఎకరాలు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, పాస్ బుక్ నం.టి05160040226 లో సర్వే నం.194/న/2లో 9.20 ఎకరాలు మహమ్మద్ లతీఫ్ పేర్లను నమోదుకు సంబంధించిన ప్రొసీడింగ్స్, రిపోర్ట్ కాపీలు అడిగారు. ఐతే ప్రొసిడింగ్స్ ఫైల్ నంబరును పేర్కొనలేదు. కార్యాలయంలోని రికార్డులన్నింటినీ పరిశీలించగా.. ఆ సర్వే నంబరుకు సంబంధించిన ఫైల్స్ ఏవీ రికార్డు సెక్షన్‌లో లేవు. కానీ, భూ రికార్డుల ప్రక్షాళన(ల్యాండ్ రికార్డ్స్ అప్డేటింగ్ ప్రోగ్రామ్) సమయంలో అర్షియా సుల్తానా, మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ పేర్లు చేర్చినట్లు స్పష్టం చేశారు. ఐతే ఎండార్స్మెంట్ లోనూ రెవెన్యూ అధికారులు దరఖాస్తుదారుడిదే తప్పు అన్నట్లుగా.. ప్రొసిడింగ్స్ నంబరు పేర్కొనని కారణాన్ని చూపించారు. నిజానికి సర్వే నంబరు, దాంట్లో చోటు చేసుకున్న ప్రతి లావాదేవీకి సంబంధించిన ప్రొసీడింగ్స్ తెలుసుకోవడం, వెతకడం పెద్ద కష్టం కాదు. కానీ, ఉన్నతాధికారులను కాపాడే ప్రయత్నాన్ని మహేశ్వరం తహశీల్దార్ సైదులు బాగా చేశారని బాధితులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఎంటంటే.. సర్వే నం.194/ఖకి సంబంధించిన అంశంపైనా స్పష్టత ఇవ్వాలని దరఖాస్తులో ఉంది. దాన్ని మినహాయిస్తూ అంటే మహమ్మద్ అబ్దుల్ షరీఫ్‌కి సంబంధించిన వివరాలను మిస్ చేశారు. ఈ సర్వే నంబరులోని స్థలాల్లోనే అత్యంత కీలకమైన ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్ వంటి వారు ఉన్నారు. ఆ వివరాలను చేర్చకపోవడం వెనుక ఆంతర్యేమిటో అర్థం కాలేదని దరఖాస్తుదారుడు అయోమయానికి గురయ్యారు. ‘దిశ’లో గురువారం ‘నాగారం ల్యాండ్స్‌పై గోప్యత’ అనే శీర్షికతో కథనం వచ్చింది. దాంతో ఎండార్స్మెంట్ కాపీని ఉదయమే దరఖాస్తుదారుడు వడ్త్యా రాములు ఇంటికి రెవెన్యూ సిబ్బంది చేత పంపడం గమనార్హం. అది కూడా ఈనెల 19న వేసిన కాపీని 24న అందించారు.

ధరణితోనే దందా..

నాగారం సర్వే నం.194లో అర్షియా సుల్తానియాకు 9 ఎకరాలు, మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ కు 9.20 ఎకరాలు, మహమ్మద్ అబ్దుల్ షరీఫ్‌కు 8.10 ఎకరాల వంతున ఉన్నట్లు పట్టాదారు పాసు బుక్స్ T05160040235, T05160040226, T05160040256 జారీ చేశారు. ఐతే 2018లో వీరికి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయగా.. హక్కులు ఎలా కల్పించారంటూ వడ్త్యా రాములు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నోటరీ డాక్యుమెంట్ల ద్వారా మ్యుటేషన్ చేశారా? సేల్ డీడ్ ద్వారా హక్కులు కల్పించారా? ఎవరు, ఎవరికి అమ్మారు? మ్యుటేషన్ ఎలా చేశారు? ఈ అంశాలపైనే అనుమానాలు నివృత్తి చేయాలని తహశీల్దార్‌ని కోరితే కోర్టు ఆర్డర్ ప్రకారం భూ రికార్డుల ప్రక్షాళన సమయంలోనే నమోదు చేసినట్లు తెలిపారు. ఐతే దానికి సంబంధించిన రికార్డులు మాత్రం లేవన్నారు. దీన్ని బట్టి వాళ్లకు భూమి హక్కులు ఎట్లా కల్పించారో అప్పటి తహశీల్దార్, కందుకూరు ఆర్డీవో, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్ కుమార్, సీసీఎల్ఏగా పని చేసిన నవీన్ మిట్టల్ లెక్క తేల్చాల్సి ఉంది. ధరణి పోర్టల్‌కు ముందు భూ రికార్డుల ప్రక్షాళన చేసేటప్పుడు ప్రతి పట్టాదారుడికి 1 బి ఫారం ఇచ్చారు. రెవెన్యూ రికార్డులను వెరిఫై చేసి సరిగ్గా ఉంటేనే జారీ చేశారు. ఏదైనా వివాదం ఉంటే రికార్డుల్లో నమోదు చేయలేదు. అలాంటివన్నీ పార్టు బి కింద నమోదు చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరి ఇక్కడ అలా చేయలేదు. ఏకంగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయడం, కొత్త పాసు బుక్స్ జారీ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ తర్వాత క్రయవిక్రయాలు కూడా అంతే త్వరగా పూర్తయ్యాయి.

ఆ ముగ్గురి నుంచే వీరికి..

నాగారంలో సర్వే నం.194లోని ల్యాండ్ కొద్ది కాలానికే అనేక సబ్ డివిజన్లుగా మారింది. ధరణి పోర్టల్‌లో పలు ట్రాన్సక్షన్స్ చోటు చేసుకున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత పాసు బుక్స్ పొందిన అర్షియా సుల్తానియా, మహమ్మద్ అబ్దుల్ లతీఫ్, మహమ్మద్ అబ్దుల్ షరీఫ్‌ల నుంచి కొందరు కొనుగోలు చేశారు. వారి నుంచి అనేక మందికి సేల్ డీడ్ అయ్యాయి. ఇదంతా 2021లోనే చోటు చేసుకున్నది. సుమారు 62 క్రయవిక్రయాలు చోటు చేసుకున్నాయి. ఇందులోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. టెర్మినస్ వెంచర్ ప్రైవేటు లిమిటెడ్ వంటి కంపెనీ కూడా ఉండడం గమనార్హం.

రికార్డులు చూడలేదా?

ఎవరైనా భూమి కొనే ముందు ఖాస్రా పహానీ, చెస్లా, వసూల్ బాకీ వంటి రికార్డులన్నింటినీ చెక్ చేసుకోవాలి. అలా కాదని 60 ఏండ్ల కింద కొనుగోలు చేసినా.. ఖాస్రా పహానీలో ఏది ఉంటే దాని ప్రకారమే నిషేధిత జాబితాలో పెట్టేస్తామని ప్రభుత్వంలోనే కీలక పాత్ర వహిస్తోన్న, భూ పరిపాలనలోనే సుదీర్ఘ కాలం చక్రం తిప్పిన నవీన్ మిట్టల్ అభిప్రాయం. రాష్ట్ర వ్యాప్తంగా 70 ఏండ్ల క్రితం రికార్డులు సరిగ్గా లేవని పీవోబీలో పెడితే నేటికీ తొలగించాలంటూ తిరిగే రైతుల సంఖ్య లక్షల్లో ఉంది. ఐతే అలాంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేసేటప్పుడు భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు, తర్వాత రికార్డులను సరి చూసుకున్నారా? లేదా? చూసి కొనుగోలు చేసినప్పుడు మహేశ్వరం తహశీల్దార్ సైదులు సర్వే నం.194 కి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఏవీ రికార్డుల గదిలో లేవని చెప్తున్నారు? అసలు ప్రొసీడింగ్స్, సర్టిఫైడ్ కాపీలు లేకుండానే భూ రికార్డుల ప్రక్షాళనలో ఆ ముగ్గురి పేర్లు నమోదు చేసిన అధికారులు ఇప్పుడేం సమాధానం చెప్తారో వేచి చూడాలి. ఆ ముగ్గురు పట్టాదారులు సమర్పించిన డాక్యుమెంట్లు, విలువైన భూ రికార్డుల పత్రాలు అప్పట్లో పనిచేసిన తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ మిస్ చేశారా? అన్న డౌట్ వస్తుంది.

హక్కులు లేకుండానే కొనుగోలు

నాగారం సర్వే నం.194లో భూ రికార్డుల ప్రక్షాళనలోనే పేర్లు నమోదు చేయించుకొని, పాసు బుక్స్ పొందారు. వారు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించకపోయినా మ్యుటేషన్ చేశారు. ఆ పత్రాలు లేవని తహశీల్దార్ ఎండార్స్మెంట్ ఇచ్చారని వడ్త్యా రాములు, ఆయన తరపు న్యాయవాది ‘దిశ’కు తెలిపారు. లిఖితపూర్వకంగానే వారికి హక్కులు లేవని తేలింది. అందుకే ఎవరైతే హక్కులు లేని వారి నుంచి కొనుగోలు చేశారో, ఆ సేల్ డీడ్స్, పాసు బుక్స్‌ని రద్దు చేయాలని కోరారు. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, పత్రాలు లేకుండానే భూమి హక్కులు కల్పించిన అధికారులపైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అంతా ఐఏఎస్, ఐపీఎస్ కుటుంబ సభ్యులే..

1. 2023 నవంబరు 6న సర్వే నం.194/ఖ2లో 0.20 ఎకరాలను ఐశ్వర్యా రాజ్ తండ్రి వికాస్ రాజ్

2. 2023 నవంబరు 5న సర్వే నం.194/ఖలో 0.20 ఎకరాలను వసుంధర సిన్హా భర్త అంజనీకుమార్,

3. 2023 నవంబరు 2న సర్వే నం.194/ఖలో 0.20 ఎకరాలను అజిత్ కుమార్ మెహంతీ తండ్రి క్షేత్రబసి మెహంతీ,

4. 2024 జనవరి 25న సర్వే నం.194/ఖలో 0.16 ఎకరాలను జి.ఓం అనిరుధ్ తండ్రి సుధీర్ బాబు గొట్టె,

5. 2024 జులై 10న నందిని మన్న్ భర్త విక్రం సింగ్ మన్న్ సర్వే నం.194/నలో 0.08 ఎకరాలు,

6. 2023 డిసెంబరు 5న రీటా సుల్తానియా భర్త సందీప్ కుమార్ సుల్తానియా సర్వే నం.194/ఖలో 0.20 ఎకరాలు,

7. 2023 నవంబరు 9న వెన్నవెల్లి రాధిక భర్త కమలాసర్ రెడ్డి సర్వే నం.194/ఖలో 0.16 ఎకరాలు,

8. 2023 నవంబరు 17న మహేశ్ మురళీధర్ భగవత్ తండ్రి మురళీధర్ రంగనాధ్ భగతవ్ సర్వే నం.194/జలో 0.16 ఎకరాలు,

9. 2023 నవంబరు 6న ముదిరెడ్డి నితిష్ రెడ్డి తండ్రి ముదిరెడ్డి మహేందర్ రెడ్డి సర్వే నం.194/నలో 0.20 ఎకరాలు,

10. 2024 మార్చి 7న తరుణ్ జోషి తండ్రి రతన్ భూషన్ జోషి సర్వే నం.194/జలో 0.16 ఎకరాలు,

11. 2023 నవంబరు 6న రేణుగోయల్ భర్త జితేందర్ గోయల్ సర్వే నం.194/జలో 0.20 ఎకరాలు,

12. 2024 మార్చి 7న పేర్ల వరుణ్ తండ్రి పేర్ల విశ్వప్రసాద్ సర్వే నం.194/జలో 0.16 ఎకరాలు,

13. 2024 మార్చి 7న దివ్య శ్రీ మోర్తాటి తండ్రి ఆంజనేయులు సర్వే నం.194/జలో 0.20 ఎకరాలు,

14. 2023 నవంబరు 6న నవీన్ మిట్టల్ తండ్రి ఎంఎల్ మిట్టల్ సర్వే నం.194/ఖలో 0.20 ఎకరాలుఇంకా అనేక మంది ఈ సర్వే నంబరులో ల్యాండ్ కొనుగోలు చేశారు.

Next Story