TG: ప్రభుత్వ జీవోలో పొరపాట్లు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహ జ్యోతి పథకం అమలు కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

TG: ప్రభుత్వ జీవోలో పొరపాట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహ జ్యోతి పథకం అమలు కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,080,38,74,000 మంజూరు చేస్తూ ఇంధన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గృహ జ్యోతి పథకం కింద అర్హులైన గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) గాను ఈ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఏప్రిల్ 2026 నెల నుంచి డిస్కంలు తమ వాస్తవ వినియోగం ఆధారంగా ప్రతి నెలా ఈ నిధులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.186.96 కోట్ల సబ్సిడీని విడుదల చేయాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ కోరారు.ఈ మొత్తాన్ని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

జీవో జారీలో అక్షర దోషాలు...

ఇంధన శాఖ జారీ చేసిన ఈ జీవోలో నిధుల అంకెలకు సంబంధించి కొన్ని పొరపాట్లు దొర్లాయి. జీవోలోని 1, 3 పేరాగ్రాఫ్లలో నిధుల మొత్తాన్ని పేర్కొనేటప్పుడు రూ. 2080,38,74,0000 అని రాశారు. ఇక్కడ అదనంగా ఒక సున్నా చేరడం గమనార్హం. అంకెల్లో ఒక సున్నా అదనంగా ఉన్నప్పటికీ, బ్రాకెట్లో అక్షరాల్లో మాత్రం రూ. 2,080.38 కోట్లు అని సరిగానే పేర్కొన్నారు. అయితే నిధుల కేటాయింపులకు సంబంధించి జీవోలో ఇచ్చిన టేబుల్స్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ లేఖలో మాత్రం నిధుల మొత్తం రూ. 2080,38,74,000 గానే సరిగ్గా ఉంది. అయితే కీలకమైన ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఇలాంటి అక్షర దోషాలు దొర్లడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Next Story