మిషన్ భగీరథ స్పెషల్ డ్రైవ్‌లు.. సర్పంచ్‌లతో కలిసి పని చేయాలని సీతక్క ఆదేశాలు

by Ramesh Naini |

వేసవి దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని, సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుని గ్రామాల వారీగా సరఫరా పరిస్థితిని సమీక్షించి, సరఫరా జరిగిందని వారి సంతకాలు తీసుకోవాలని సీతక్క తెలిపారు

మిషన్ భగీరథ స్పెషల్ డ్రైవ్‌లు.. సర్పంచ్‌లతో కలిసి పని చేయాలని సీతక్క ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ప్రజలకు నిరంతర, నాణ్యమైన తాగునీటి సరఫరా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న మిషన్ భగీరథ కార్యాలయంలో గ్రామీణ తాగునీటి సరఫరా, వేసవి సన్నద్ధతపై నిర్వహించిన సమగ్ర సమీక్ష సమావేశంలో ఆమె అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఎఈలు, ఎస్‌ఈలు పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా మిషన్ భగీరథ సోర్స్ పాయింట్లు, రిజర్వాయర్లలో నీటి లభ్యత, పంపింగ్ వ్యవస్థ, గ్రామాల వారీగా సరఫరా పరిస్థితులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో తగినంత నీరు నిల్వలో ఉందని, వేసవిలోనూ పెద్ద ఇబ్బందులు ఉండవని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల ఆవాసాల్లో కేవలం 150 ఆవాసాలకు మాత్రమే మిషన్ భగీరథ నీరు అందడం లేదని, ఇటీవల కొత్తగా 397 ఆవాసాలు ఏర్పాటయ్యాయని అధికారులు తెలిపారు. కొండలపై, అటవీ ప్రాంతాల్లో పైప్‌లైన్ వేయడం సవాల్‌గా ఉన్న చోట్ల స్థానిక జల వనరులను వినియోగించి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నిరంతర తాగునీటి సరఫరా కల్పించాలని మంత్రి ఆదేశించారు.

సర్పంచ్‌ల ఫోన్ కాల్స్‌కు స్పందించాలి

వేసవి దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని సూచించారు. సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుని గ్రామాల వారీగా సరఫరా పరిస్థితిని సమీక్షించి, సరఫరా జరిగిందని వారి సంతకాలు తీసుకోవాలని తెలిపారు. సర్పంచ్‌ల ఫోన్ కాల్స్‌కు తక్షణ స్పందన ఇవ్వాలని, సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. అలాగే గ్రామాల వారీగా తాగునీటి అవసరాలు, సరఫరా పరిస్థితులపై సర్పంచ్‌లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించాలని మంత్రి సూచించారు. అప్పుడే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు స్పష్టంగా తెలుస్తాయి. ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవచ్చు అని ఆమె పేర్కొన్నారు. గతంలో మాదిరిగా వాస్తవాలను దాచిపెట్టి 100 శాతం నల్లా నీటి సరఫరా జరుగుతోందని నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ తాగునీటి సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదన్నారు. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ మహా మేడారం జాతర సందర్భంగా ఎక్కడా తాగునీటి సమస్యలు రాకుండా సమర్థవంతంగా పనిచేసిన మిషన్ భగీరథ ఇంజనీరింగ్ సిబ్బందిని మంత్రి సీతక్క అభినందించారు.

Next Story