మిస్‌వరల్డ్ పోటీలు.. సచివాలయం వద్ద ఇజ్రాయెల్ జెండాను తొలగించిన యువకుడు అరెస్ట్

by Ramesh Naini |

తెలంగాణ సచివాలయం సమీపంలో వివిధ దేశాలకు చెందిన జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు.

మిస్‌వరల్డ్ పోటీలు.. సచివాలయం వద్ద ఇజ్రాయెల్ జెండాను తొలగించిన యువకుడు అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సచివాలయం (Secretariat) సమీపంలో వివిధ దేశాలకు చెందిన జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. నగరంలో 72వ మిస్‌వరల్డ్ -2025 (Miss World pageant) పోటీలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ దేశాల జాతీయ జెండాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతం అయిన తెలంగాణ సచివాలయం దగ్గర ఓ జాతీయ జెండా తొలగింపు కలకలం రేపుతోంది. జకీర్ అనే యువకుడు సోషల్ మీడియాలో లైవ్ పెట్టి మరి ఇజ్రాయెల్ జెండాను తొలగించాడు.(Israel-Palestine) ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ జెండాను యువకుడు తొలగించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తిరిగి ఇజ్రాయెల్ జెండాను అధికారులు ఏర్పాటు చేశారు. అయిన కూడా ఇజ్రాయెల్ జెండాను తొలగించే ప్రయత్నం జరుగుతోందని నెటిజన్లు ఎక్స్ వేదికగా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వమే ఏర్పాటు చేసిన జెండాను తొలగించడం ఏమిటని నెటిజన్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ఈ నేపథ్యంలోనే జకీర్ అనే యువకుడిపై సైఫాబాద్ పీఎస్ పరిధిలో కేసు నమోదు చేశారు. ఈ మేరకు తాజాగా అతని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎక్స్ వేదికగా హైదరాబాద్ పోలీస్ ట్వీట్ చేసింది. జాతీయ జెండాను తొలగించే అగౌరవకరమైన చర్య తర్వాత హైదరాబాద్ పోలీస్ శాఖ వేగంగా చర్యలు తీసుకుందని స్పష్టం చేసింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్లు 138/2025, 141/2025 కింద రెండు కేసులు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది. తదుపరి దర్యాప్తు జరుగుతోందని హైదరాబాద్ పోలీస్ తెలిపింది.

Next Story