మునుగోడు కొత్త రిటర్నిగ్ అధికారిగా మిర్యాలగూడ RDO

by Disha Web Desk 2 |
మునుగోడు కొత్త రిటర్నిగ్ అధికారిగా మిర్యాలగూడ RDO
X

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో చోటు చేసుకున్న తప్పిదాల వెనుక ఆసక్తికర అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థికి ఒక గుర్తు కేటాయించిన గంటల వ్యవధిలోనే వాటి స్థానంలో మరో గుర్తును కేటాయించడం వెనుక రిటర్నింగ్ అధికారి జగన్నాథ రావుపై ఒత్తిడే ప్రధాన కారణం అనే టాక్ వినిపిస్తోంది. అధికార పార్టీ నేతలు, ఉన్నతాధికారులతో పాటు పని ఒత్తిడి ఆయనపై పడినట్లు తెలుస్తోంది. ఇక్కడ పోటీ చేస్తున్న యుగతులసి పార్టీకి చెందిన అభ్యర్థికి లాటరీలో రోడ్ రోలర్ గుర్తు దక్కింది. అయితే ఆ మరుసటి రోజే బ్యాలెట్ పై రోడ్ రోలర్ కు బదులుగా బేబీ వాకర్ గుర్తును కేటాయించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాడు. ఈ విషయంపై రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం ఆర్వో తీరును తప్పు పడుతూ మునుగోడు బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించింది. ఎన్నికల గుర్తుల కేటాయింపుల వ్యవహారంలో ఆయన పాత్రపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం తనకు లేని అధికారాన్ని ఉపయోగించుకుని అభ్యర్థుల గుర్తులు మార్చారని ఈసీ మండిపడింది. విధి నిర్వహణలో తీవ్ర లోపంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రోడ్ రోలర్ గుర్తుపై ఆర్వో ఆఫీస్ లో గురువారం విచారణ జరిపిన కేంద్ర పరిశీలకుడు ఈసీకి నివేదిక పంపించారు. ఈ నివేదిక ఆధారంగా ఆర్వోపై వేటు పడింది. ఆయన స్థానంలో మునుగోడు బాధ్యతలను మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ కు అప్పగించారు.

ఈసీ నిర్ణయాన్ని ఖండించిన మంత్రి కేటీఆర్:

మునుగోడు రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు బదిలీలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఈ అంశంలో ఈసీ తీరు ఆక్షేపణీయమని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని అనడానికి ఇది ఓ ఉదాహరణ అని అన్నారు. పార్టీలకు అతీతంగా పని చేయాల్సిన ఎన్నికల సంఘంపై బీజేపీ ఒత్తిడి స్పష్టంగా ఉందని అర్థం అవుతోందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థన మేరకు రోడు రోలర్ గుర్తును 2011లోనే తొలగించారని ఇప్పుడు మళ్లీ తీసుకురావడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. నిబంధనల మేరకు పని చేసిన మునుగోడు రిటర్నింగ్ అధికారి జగన్నాథ్ రావు పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed