గాంధీ హాస్పిటల్‌ ఐవీఎఫ్ సెంటర్‌లో అద్భుతం.. పదేళ్ల నిరీక్షణకు కవలల రూపంలో ఫలితం

by Ramesh Naini |

వారి పదేళ్ల నిరీక్షణకు గాంధీ హాస్పిటల్‌లో శుభం కార్డు పడింది. గాంధీ హాస్పిటల్‌లోని ఐవీఎఫ్ సెంటర్‌‌లో ఐవీఎఫ్‌ చేయించుకున్న చికిత్స ఫలించి బుధవారం అదే హాస్పిటల్‌లో కవల పిల్లలు జన్మించారు.

గాంధీ హాస్పిటల్‌ ఐవీఎఫ్ సెంటర్‌లో అద్భుతం.. పదేళ్ల నిరీక్షణకు కవలల రూపంలో ఫలితం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని బోయగూడలో నివసిస్తున్న గడ్డం త్రివేణి, మస్తాన్‌ రావు దంపతులు పదేళ్లుగా సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు. వారి పదేళ్ల నిరీక్షణకు గాంధీ హాస్పిటల్‌లో శుభం కార్డు పడింది. గాంధీ హాస్పిటల్‌లోని ఐవీఎఫ్ సెంటర్‌‌లో ఐవీఎఫ్‌ చేయించుకున్న చికిత్స ఫలించి బుధవారం అదే హాస్పిటల్‌లో కవల పిల్లలు జన్మించారు. ఒక బాబు, ఒక పాపతో ఇప్పుడు ఆ దంపతులు సంతోషంగా ఉన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఇదే చికిత్సకు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉండగా, గాంధీ హాస్పిటల్‌లో పూర్తిగా ఉచితంగా చికిత్సతో పాటు డెలివరీ కూడా చేశారు. అవసరమైన అన్ని మెడిసిన్స్ ఉచితంగా అందజేశారు.

ప్రైవేటులో 13 ప్రయత్నాలు విఫలం

వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న ఈ దంపతులు పదేళ్లుగా సంతానం కోసం ఎదురుచూశారు. ఈ క్రమంలో ఎన్నో ప్రైవేటు ఆస్పత్రులు తిరిగి చికిత్సలు చేయించుకున్నప్పటికీ ఫలితం రాలేదు. బయట ఆస్పత్రుల్లో 13 సైకిళ్ల ఓవ్యులేషన్‌ ఇండక్షన్‌, ఒకసారి ఐయూఐ చికిత్స చేయించుకున్నా సంతానం కలగలేదని త్రివేణి దంపతులు వెల్లడించారు. చివరకు గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్‌ సెంటర్‌ను ఆశ్రయించగా, వైద్యులు పరీక్షలు చేసి సమస్యను గుర్తించి ఐవీఎఫ్ చికిత్స అందజేశారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకూ గాంధీలోనే అవసరమైన వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం తల్లి, శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

అభినందనలు తెలిపిన మంత్రి

ఈ సందర్భంగా గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, ఐవీఎఫ్ సెంటర్ హెడ్‌, డాక్టర్ టి. శోభ, డాక్టర్ ఫాతిమా, డాక్టర్ శివకృష్ణ, నర్సింగ్‌ ఆఫీసర్‌ లావణ్య, సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. గాంధీ, పేట్లబుర్జు హాస్పిటల్స్‌లో తాము ఏర్పాటు చేసిన ఐవీఎఫ్ సెంటర్లు ప్రజలకు ఉపయోగపడుతుండడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా అత్యాధునిక సంతానోత్పత్తి చికిత్సలు విజయవంతంగా అందుతున్నాయని, పేదలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Next Story