కీలక శాఖల కోసం మంత్రుల వేట.. ఢిల్లీలో ముమ్మరంగా లాబీయింగ్!

by Kema Shiva Kumar |

తెలంగాణలో త్వరలో కేబినెట్ విస్తరణ, శాఖల మార్పులు ఉంటాయనే ప్రచారంతో మంత్రుల మధ్య లాబీయింగ్ ముమ్మరమైంది.

కీలక శాఖల కోసం మంత్రుల వేట.. ఢిల్లీలో ముమ్మరంగా లాబీయింగ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో కేబినెట్ విస్తరణతో పాటు, మంత్రుల శాఖల్లో మార్పులు చేస్తారని ప్రచారం ఊపందుకోవడంతో ప్రస్తుతం ఉన్న పోర్టుఫోలియోలు వదులుకుని కీలక శాఖలను దక్కించుకునేందుకు సీనియర్ మంత్రులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకోసం ఢిల్లీ పెద్దల వద్ద లాబీయింగ్ మొదలుపెట్టినట్టు చర్చ జరుగుతున్నది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న కీలక శాఖలను సొంతం చేసుకోవాలని కొందరు ఆశపడుతున్నారు. తమ వద్ద ఉన్న ప్రయారిటీ లేని శాఖలను తీసేసి.. ప్రాధాన్యత ఉన్న వాటిని కేటాయిస్తే బాగుంటుందని మరికొందరు మంత్రులు ఆశపడుతున్నారు. దీంతో కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పు ఏ విధంగా ఉంటుందోననే ఆసక్తి మొదలైంది.

దక్షిణ తెలంగాణ నుంచే పోటీ ఎక్కువ

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోం, మున్సిపల్, విద్యా, కమర్షియల్ ట్యాక్స్, శాఖలు ఉన్నాయి. కానీ అందులో హోం, మున్సిపల్ శాఖలపైనే దక్షిణ తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ మంత్రులు ఆశలు పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. శాఖల మార్పు జరిగితే హోం శాఖ తమకు ఇవ్వాలని, లేదంటే మున్సిపల్ శాఖ కేటాయించాలని హైకమాండ్ వద్ద పలువురు సీనియర్ మంత్రులు లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది. నేరుగా అధిష్టానంతో సంప్రదింపులు చేసే చొరవ ఉండటంతో ప్రయత్నాలు తీవ్రం చేసిన ట్టు టాక్. కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలి? ఎవరిని పక్కన పెట్టాలి? అనే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం సూచనలు చేయడం సహజం. కానీ శాఖల కేటాయింపు విషయంలో జోక్యం చేసుకుంటుందా? అనే అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ మధ్య అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామిని కేబినెట్‌లోకి తీసుకున్న తర్వాత శాఖల కేటాయింపు విషయంలో అధిష్టానం జోక్యం చేసుకున్నట్టు టాక్. ఓ మంత్రి ఏఐసీసీలోని ఓ కీలక నేత ద్వారా లాబీయింగ్ చేసి, తనకు నచ్చిన శాఖను దక్కించుకున్న విషయాన్ని సీనియర్ లీడర్లు గుర్తు చేస్తున్నారు. అదే దారిలో ఇప్పుడు సీనియర్ మంత్రులు కీలకమైన హోం, మున్సిపల్ శాఖలను దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తున్నది.

‘రెవెన్యూ’ కోసం తీవ్ర పోటీ

శాఖల మార్పులు చేర్పులు జరిగితే రెవెన్యూ శాఖను దక్కించుకోవాలని చాలా మంది మంత్రులు ప్రయత్నిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల టాక్. ఆ శాఖ కోసం దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రులే పోటీ పడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. తమ వద్ద ప్రస్తుతం ఉన్న రెండు శాఖల్లో ఒక దానిని తొలగిస్తే దానికి బదులుగా రెవెన్యూ శాఖ ఇవ్వాలంటూ ప్రపోజల్ పెడుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రెవెన్యూ శాఖ.. పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి వద్ద ఉన్నది. ఈ రెండున్నరేండ్ల సమయంలో ఆయనకు అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఏర్పడటంతో శాఖను ఆయన నుంచి కదిలించే అవకాశం లేదనే చర్చ జరుగుతున్నది.

మున్సిపల్, ఎడ్యుకేషన్ సీఎం వద్దే..

మున్సిపల్, ఎడ్యుకేషన్ శాఖలను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే పెట్టుకుంటారని తెలిసింది. ఈ మేరకు ఆయనకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. ఆ రెండు శాఖలను ఇతరులకు ఇవ్వడం వల్ల కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హైకమాండ్ అభిప్రాయపడినట్టు ప్రచారం ఉంది. ఈ నెలలోనే కేబినెట్ విస్తరణతోపాటు, శాఖల మార్పులు ఉంటాయని ప్రచారం జోరందుకున్నది. ఇప్పుడే చేపట్టడం వల్ల ఏమైనా అలకలు, అసంతృప్తులు ఉంటే సర్దుకుంటాయని.. మరింత ఆలస్యం చేస్తే ఆ ప్రభావం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌తో చర్చించి ముహుర్తం ఖరారు చేస్తారని టాక్.

పనితీరు ఆధారంగా శాఖల మార్పులు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయింది. ఈ కాలంలో కొందరు మంత్రుల పనితీరు సరిగా లేదని, కొందరు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీంతో మంత్రుల శాఖలను మార్చాలని హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ఒక్కో మంత్రి వద్ద రెండేసి శాఖలు ఉన్నాయి. కొందరు మంత్రుల నుంచి ఒక శాఖను తొలగించడం, మరికొందరి నుంచి రెండు శాఖలను తొలగించడం, అదే సమయంలో కొందరికి కొత్త శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.

ఇద్దరు అవుట్.. నలుగురు ఇన్

ఒకవేళ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగితే ఇద్దరు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించి, నలుగురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగా దక్షిణ తెలంగాణ నుంచి ఒకరు, ఉత్తర తెలంగాణ నుంచి మరొకరిని తొలగించి, అదే సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను కేబినెట్‌లోకి తీసుకోనున్నట్టు తెలిసింది. కొత్తగా మంత్రుల్లో ఒకరు రెడ్డి, ఇద్దరు బీసీ, ఒకరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటారని ప్రచారం జరుగుతున్నది. కొత్త మంత్రుల సామాజిక సమీకరణాలను సమతూకం చేసేందుకు కేబినెట్ హోదాతో ఉన్న డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం అదే సమయంలో ప్రకటిస్తారని తెలిసింది.

ప్రభుత్వంలో ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్న ఓ మంత్రి, ఆయనతో పాటు పార్టీలో ఇప్పటికే పలు పదవులు అనుభవించిన మంత్రికి వారి పోర్టుఫోలియోలు నచ్చడం లేదని టాక్. వాటిలో సమస్యలు, తలనొప్పులు ఎక్కువగా ఉన్నాయని, వాటి వల్ల విమర్శల పాలు అవుతున్నామని.. వాటి నుంచి తప్పుకుని కీలక శాఖలను కోరుకుంటున్నట్టు సమాచారం. ఇక మరో మంత్రి విషయానికి వస్తే తనకు కేటాయించిన శాఖలు ప్రయారిటీ లేనివని, త్వరలో జరిగే శాఖల మార్పుల్లో తనకు కీలకమైన శాఖలు ఇవ్వాలని కోరుతున్నట్టు టాక్. మరో వైపు ఎస్టీ సంక్షేమ శాఖకు అదే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇస్తే తమకు సమస్యలు చెప్పుకోవడం సులువుగా ఉంటుందని పలు గిరిజన సంఘాలు హైకమాండ్ కు లేఖలు రాసినట్టు తెలిసింది.

Next Story