- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అజారుద్దీన్‍కు మంత్రి పదవి సరే.. రాజస్థాన్‍లో బీజేపీ చేసిందేంటి? మహేశ్ కుమార్ గౌడ్
మైనారిటీ నేతకు మంత్రి పదవి వస్తుంటే బీజేపీ అక్కసు వెళ్లగక్కుతోందని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ క్రీడాకారుడు మహమ్మద్ అజారుద్దీన్ ను మంత్రివర్గంలో కి తీసుకోవాలని ఏఐసీసీ, సీఎం రేవంత్ రెడ్డి భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కుటిల ప్రయత్నం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విమర్శించారు. అజారుద్దీన్ గురించి దేశానికి, తెలంగాణకు, హైదరాబాద్ ప్రజలకు తెలియనిది కాదన్నారు. అజారుద్దీన్ క్రికెటర్‍గా, ఎంపీగా ఆయన ఈ దేశానికి సేవలు చేశారు. అలాంటి అజారుద్దీన్‍కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని భావిస్తే బీజేపీ విషం వెళ్లగక్కుతోందన్నారు. మైనార్టీకి మంత్రిగా అవకాశం వస్తే ఓర్చుకోలేకపోతోందని విమర్శించారు. అజారుద్దీన్ కు మంత్రి పదవిని ఆపాలంటూ ఇవాళ తెలంగాణ బీజేపీ నేతలు ఈసీని కలిసిన నేపథ్యంలో నిజామాబాద్‍లో పీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్ర గమనిస్తే మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారే మైనార్టీలకు కేబినెట్ లో ప్రాధాన్యత ఇద్దామని భావించినా ఎమ్మెల్యేలుగా మైనార్టీ నేతలు ఎవరూ గెలవలేక పోవడంతో కుదరలేదన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఉండటంతో అజారుద్దీన్‍కు అవకాశం ఇచ్చి మైనార్టీలకు సంక్షేం, అభివృద్ధి ప్రయత్నాన్ని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.
రాజస్థాన్ లో మీరు చేసిందేంటి?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) సమయంలో అజారుద్దీన్ కు (Azharuddin) ఎలా మంత్రివర్గంలోకి తీసుకుంటారని బీజేపీ ప్రశ్నిస్తోందని మరి ఇటీవల రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమిటి అని ప్రశ్నించారు. కరణ్ పుర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వేళ అక్కడ బీజేపీ ఏకంగా తమ అభ్యర్థి సురేంద్ర పాల్ సింగ్ ను మంత్రివర్గంలోకి తీసుకోలేదా అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఇది బీజేపీ ద్వంద్వనీతికి నిదర్శనం అని రాజస్థాన్ లో ఒక నీతి.. తెలంగాణలో బీజేపీకి మరో నీతి ఉంటుందా అని ప్రశ్నించారు. రాజస్థాన్‍లో పోటీలో ఉన్న అభ్యర్థిని మంత్రిలోకి తీసుకుంటే లేని తప్పు ఇక్కడ పోటీలో లేని అజారుద్దీన్ కు కేబినెట్ లోకి తీసుకుంటే మీకు నొప్పేంటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే కల్వకుట్ల చెప్పినట్లుగా బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నట్లుగా అర్థం అవుతోందన్నారు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించేందుకు బీజేపీ తాపత్రయపడుతోందని అర్థం అవుతోందన్నారు. జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓట్లు ఎలాగూ బీజేపీకి పడవవి కానీ బీఆర్ఎస్ ను గెలిపించుకునేందుకే ఈ ప్రయత్నాలన్నీ అని మండిపడ్డారు. నిబంధనల ప్రకారమే రేపు కేబినెట్ విస్తరణకు వెళ్తున్నామన్నారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని గవర్నర్‍పై కూడా బీజేపీ పార్టీ ఒత్తిడి తీసుకువస్తున్నట్లు మాకు అనుమానాలు వస్తున్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ కేంద్రంలోని బీజేపీ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని అన్నారు.






