మినిస్టర్ Vs ఐఏఎస్..! ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో వివాదం

by Kema Shiva Kumar |

పాలనా విషయాల్లో మంత్రులకు, బ్యూరోక్రట్స్ సలహాలు, సూచనలు ఇవ్వాలి.

మినిస్టర్ Vs ఐఏఎస్..! ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో వివాదం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాలనా విషయాల్లో మంత్రులకు, బ్యూరోక్రట్స్ సలహాలు, సూచనలు ఇవ్వాలి. అందులో కొత్తగా మంత్రి బాధ్యతలు తీసుకున్న లీడర్ల విషయంలో కొంత చొరవ తీసుకుని, వారికి అర్థమయ్యేలా వివరించాలి. కానీ ఈ మధ్య కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఓ మంత్రితో ఓ సీనియర్ ఐఏఎస్‌ ఫోన్‌లో మాట్లాడిన తీరు హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రి అనే హోదాను గౌరవించకుండా, ఆ ఐఏఎస్ చులకనగా మాట్లాడినట్టు ఆ సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆ అధికారికి చాలా గర్వం, అహం ఉందని, ప్రజాప్రతినిధుల పట్ల మర్యాద లేకుండా వ్యవహరిస్తుంటారని ఫైర్ అవుతున్నారు.

కటువుగా సమాధానం..

తన శాఖకు చెందిన ఫైల్స్ ఆ సెక్రెటరీ వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే క్లియర్ చేయాలని చెప్పేందుకు సంబంధిత సెక్రెటరీకి మంత్రి ఫోన్ చేశారు. ‘సెక్రెటరీ గారు.. వెంటనే ఆ ఫైల్స్ క్లియర్ చేసి పంపండి ప్లీజ్’ అని మంత్రి కోరారు. కానీ సెక్రెటరీ మాత్రం మంత్రి అనే కనీస మర్యాద సైతం ఇవ్వకుండా వ్యవహరించినట్టు సమాచారం. ‘ఏంటీ.. మీరు ఎప్పుడు పడితే అప్పుడే ఫోన్ చేస్తారా? ఇలా పదే పదే ఫోన్ చేస్తే ఎలా? నేను పనులు చేయొద్దా? ఎప్పుడు ఏ ఫైల్ క్లియర్ చేయాలో మాకు తెలుసు’ అంటూ కటువుగా మాట్లాడారు. కానీ మంత్రి మాత్రం తన సహజ ధోరణిలో ‘సరే సార్. కాస్త త్వరగా క్లియర్ చేయండి’అంటూ రిక్వెస్ట్ చేశారు.

సెక్రెటరీ తీరుపై విమర్శలు..

ఫోన్ మాట్లాడే సమయంలో మంత్రి ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉండటంతో ఆ సమయంలో మంత్రి వద్ద ఉన్న పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు సమాచారం. దీంతో సెక్రెటరీ తీరు బహిర్గతమైందని ఆ నేతలు చర్చించుకుంటున్నారు. నిజానికి ఆ ఆఫీసర్ చాలా మంది ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే తీరుగా వ్యవహరిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆ మంత్రి స్థానంలో ఇతర సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉంటే, ఆ అధికారి ఆదే తరహాలో మాట్లాడేవారా? అనే చర్చ జరుగుతున్నది.

Next Story