- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ పరికరాలు తెచ్చారా? కేసీఆర్ విచారణపై మంత్రి వాకిటి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం ముగిసిందని, కేసీఆర్ కు నిబద్ధత, నిజాయితీ ఉంటే కడిగిన ముత్యంలా బయటకు రావాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం ముగిసిందని, కేసీఆర్ కు నిబద్ధత, నిజాయితీ ఉంటే కడిగిన ముత్యంలా బయటకు రావాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మీ సొంత కూతురు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించిందని, రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యం నడుస్తుందని అనుకుంటున్నారు..ఇప్పుడు నడుస్తుంది అంబేద్కర్ రాజ్యాంగమన్నారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం కాదని, ఇది దొంగతనాల కంటే, హత్యల కంటే కూడా ప్రమాదకరమైన నేరం అని అన్నారు. ఇది నేరుగా ప్రజాస్వామ్యంపై దాడి అని, ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ పై జరిగిన ఘెరమైన దాడి అన్నారు. తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ దేశంలోనే అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. దీని వల్ల తెలంగాణ ప్రతిష్ట దేశవ్యాప్తంగా దిగజారిందన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కక్షసాధింపు కోసం కాదు.. ఇది పూర్తిగా చట్టబద్ధమైన విచారణ.. నిజం బయటకు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వాకిటి శ్రీహరి అన్నారు. ఇవి ఆరోపణలు కావు.. పోలీసుల విచారణలో బయటపడ్డ నిజాలని, ఈ స్థాయిలో ఆధారాలు లభించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. సామాన్య ప్రజల ఫోన్లు, వ్యాపారుల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, సినీనటుల ఫోన్లు, చివరికి భార్య భర్తల ఫోన్లు ట్యాప్ చేయడం ఎంత నీచమైన చర్య? ఇది రాజ్యాంగ విరుద్ధం.. ఇది ప్రజల ప్రైవసీపై చేసిన నేరం.. తప్పు చేయకపోతే డిసెంబర్ 4న ఎస్ఐబీ ఆఫీస్‌లో సీసీ కెమెరాలు ఎందుకు ఆఫ్ చేశారు? అని ప్రశ్నించారు.
42 హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారు
42 హార్డ్ డిస్క్‌లను ఎందుకు ధ్వంసం చేశారు? అని నిలదీశారు. వందల ఫైళ్లను ఎందుకు నాశనం చేశారు? అని వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. సీఎం అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తెచ్చి ఇంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేయడం సాధ్యమా? ఈ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టే పరికరాలను ధ్వంసం చేశారు. అదే వారు గెలిచుంటే ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతూనే ఉండేదని ఆయన తెలిపారు. ప్రజల స్వేచ్ఛను, గౌరవాన్ని కాపాడడానికి ఈ విచారణ జరుగుతుంది.. ఎంతటి వారైనా చట్టాన్ని గౌరవించాల్సిందే అని వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.
సొంత అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారు
కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ డ్రామా చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. ట్యాపింగ్ దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ అని తెలిపిందని, దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే రేవంత్ రెడ్డి భయపడతారా? అని మండిపడ్డారు. ఇజ్రాయెల్ నుంచి ఎందుకు ట్యాపింగ్ పరికరాలు తెచ్చారు? అధికారం పోయాక ఎందుకు నాశనం చేశారు? కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫ్రెండ్ ఫోన్ ట్యాప్ చేసి 13 కోట్లు వసూలు చేశారు..బీజేపీ నాయకులు రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్ లాంటి వారి ఫోన్లు ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. సొంత అల్లుడి ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించాలని, తెలంగాణ ఆత్మగౌరవం అంటే బీఆర్ఎస్ కాదన్నారు. మీ పార్టీ పేరులో తెలంగాణ పదాన్ని తీసివేసిన దొంగలు మీరు.. తెలంగాణ ఆత్మ గౌరవం అంటే అమరవీరుల త్యాగాలు..ట్యాపింగ్ తో తెలంగాణ పరువు తీశారు..చంద్రమండలం పోయినా మిమ్మల్ని వదలమని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. బీజేపీ ట్యాపింగ్ కేసులో డ్రామాలు ఆడుతుంది.. కూలీ బ్యాచ్ ను పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కాంగ్రెస్ భయపడదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హెచ్చరించారు.






