పాల ఉత్పత్తిలో గుజరాత్‌ మోడల్‌ తెలంగాణకు అవసరం : మంత్రి వాకిటి శ్రీహరి బృందం పర్యటన

by Ramesh Naini |

పాడి పరిశ్రమ అభివృద్ధి విధానాలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి బృందం గుజరాత్​ పర్యటించింది.

పాల ఉత్పత్తిలో గుజరాత్‌ మోడల్‌ తెలంగాణకు అవసరం : మంత్రి వాకిటి శ్రీహరి బృందం పర్యటన
X

దిశ, తెలంగాణ బ్యూరో : పాడి పరిశ్రమ అభివృద్ధి విధానాలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి బృందం గుజరాత్​ పర్యటించింది. ఆదివారం ఆనంద్‌లోని ప్రముఖ అమూల్ పాల ప్రాసెసింగ్ ప్లాంట్‌ను రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి కలిసి సందర్శించారు. అమూల్ ప్లాంట్ సందర్శనకు వచ్చిన మంత్రిబృందానికి నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్‌ డాక్టర్‌ మీనేష్‌ షా బృందం ఘనస్వాగతం పలికింది. ఈ సందర్భంగా అమూల్ సంస్థలో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక విధానాలు, రైతులకు అందిస్తున్న సేవలు, పాల సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ , మార్కెటింగ్ వ్యవస్థలపై మంత్రి బృందానికి చైర్మన్‌ డాక్టర్‌ మీనేష్‌ షా వివరించారు. పాడి పరిశ్రమ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడం, సహకార వ్యవస్థను మరింత విస్తరించడం వంటి అంశాలపై గుజరాత్ అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణకు ప్రేరణగా నిలుస్తాయి..

అమూల్ మోడల్ ప్రగతి పథంపై, దేశవ్యాప్తంగా సహకార డెయిరీ రంగ అభివృద్ధిలో పాత్ర గురించి తెలిపారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, గుజరాత్‌లో అమూల్ మోడల్ ద్వారా సాధించిన విజయాలు తెలంగాణకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసి, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో, మహిళల ఆర్థిక సాధికారతలో డెయిరీ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పాల ఉత్పత్తి పెంపు, ఆధునిక సాంకేతిక వినియోగం, సహకార వ్యవస్థ బలోపేతం, రైతులకు మెరుగైన ధరలు అందించే దిశగా గుజరాత్ అనుభవాలను తెలంగాణలో అమలు చేయనున్నట్లు తెలిపారు. అక్కడ గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాల ఉత్పత్తి కేంద్రాల అభివృద్ధి ఆదర్శనీయమన్నారు. పాల ఉత్పత్తిలో గుజరాత్‌ మోడల్‌ తెలంగాణకు అవసరం అని, పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని పాల ఉత్పత్తిలో నెంబర్‌వన్‌గా నిలిపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు.

Next Story