- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్‌ఎల్‌బీసీలో భద్రతా ప్రమాణాలు పాటించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
SLBC టన్నెల్, డిండి ప్రాజెక్ట్, ఆచంపేట బ్రాంచ్ కాలువ పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ (ఎస్ఎల్‌బీసీ) టన్నెల్ పనులు వేగవంతం అవుతున్నాయని.. భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్‌లో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, డిండి ప్రాజెక్ట్, ఆచంపేట బ్రాంచ్ కాలువ పనులపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. టన్నెల్ ఇన్‌లెట్ వైపున తవ్వకాల పనులు తిరిగి ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఇప్పటికే దేవరకొండ అవుట్‌లెట్ వైపు పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడు రెండు వైపులా తవ్వకాలు కొనసాగుతున్నాయని చెప్పారు. టన్నెల్ చివరి భాగం వరకు సరైన వెంటిలేషన్ ఉండేలా చూడాలని, నిరంతర పర్యవేక్షణతో కార్మికుల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇన్‌లెట్ వైపు 20 మీటర్ల ఓపెన్ కట్ పనులు పూర్తి చేసి అదనపు భద్రతా ఏర్పాట్లు చేసిన అనంతరం తవ్వకాలు పునఃప్రారంభించినట్లు తెలిపారు. గత నెల దేవరకొండ అవుట్‌లెట్ వైపున పనులు తిరిగి ప్రారంభించి మొదటి వారంలోనే ఏడు ఎక్స్‌కవేషన్ సైకిళ్ల ద్వారా సుమారు 20 మీటర్ల తవ్వకాలు చేపట్టినట్లు వివరించారు. మొత్తం 43.93 కిలోమీటర్ల పొడవున్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ అలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్‌లో కీలక భాగమని మంత్రి తెలిపారు.
రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం, సాంకేతిక పరిమితుల కారణంగా మధ్యలో యాక్సెస్ లేకుండా రెండు వైపులా తవ్వకాలు చేపడుతున్నామని చెప్పారు. పూర్తయిన తర్వాత ప్రపంచంలోనే ఈ తరహాలో అతి పొడవైన టన్నెల్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. భూగర్భంలో క్వార్ట్జైట్, గ్రానైట్ రాళ్లు ఉండటం, 15 వాగులు దాటడం వంటి సవాళ్ల మధ్య పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. 2025 ఫిబ్రవరి 22న ఇన్‌లెట్ వైపున టన్నెల్ పైకప్పు కూలి నీరు, మట్టి ప్రవేశించి టన్నెల్ ముంపునకు గురైన ఘటనలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందిన విషయం గుర్తు చేశారు. ఆ ఘటన తర్వాత సాంకేతిక కమిటీ సిఫార్సుల మేరకు ఆధునిక టన్నెలింగ్ పద్ధతులను అమలు చేస్తున్నామని తెలిపారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిపుణులతో కలిసి హెలికాప్టర్ ఆధారిత జియోఫిజికల్ సర్వే నిర్వహించి భూగర్భ ప్రమాదాలను గుర్తించే ప్రయత్నం చేశామని చెప్పారు. ప్రముఖ టన్నెల్ నిపుణులతో సాంకేతిక కమిటీ ఏర్పాటుచేసి పనులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. 2027 చివరినాటికి టన్నెల్ బ్రేక్‌త్రూ సాధించి, 2028 జూన్ నాటికి ప్రాజెక్ట్ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ టన్నెల్ పూర్తయితే కృష్ణా నదీ జలాలను గ్రావిటీ ద్వారా తరలించి నల్గొండ జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు అందుతుందని చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ విధానంతో వచ్చే విద్యుత్ ఖర్చులో సంవత్సరానికి రూ.500 కోట్ల వరకు ఆదా అవుతుందని వివరించారు. పనుల్లో ఆలస్యం, నిర్లక్ష్యం అస్సలు సహించేది లేదని హెచ్చరించారు. పనుల పురోగతిని పరిశీలించేందుకు ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్‌ను టన్నెల్ ప్రాంతానికి వెళ్లి పరిస్థితులు సమీక్షించాలని ఆదేశించారు.






