నిరూపించుకోండి.. లేకపోతే చర్యలు తీసుకుంటాం.. మంత్రి ఉత్తమ్ సంచలన హెచ్చరిక

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-23 13:58:17  IST  )

కాళేశ్వరం(Kaleshwaram)పై బీఆర్ఎస్(BRS) వికృత చేష్టలకు పాల్పడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) మండిపడ్డారు.

నిరూపించుకోండి.. లేకపోతే చర్యలు తీసుకుంటాం.. మంత్రి ఉత్తమ్ సంచలన హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం(Kaleshwaram)పై బీఆర్ఎస్(BRS) వికృత చేష్టలకు పాల్పడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) మండిపడ్డారు. శుక్రవారం NDSA నివేదికపై మంత్రి ఉత్తమ్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌, హరీష్‌రావు నోటీసులకే వణికిపోతున్నారు.. నోటీసులు అందగానే బీఆర్ఎస్‌ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. మేం విచారణకే ఆదేశించాం.. ఇంకా చర్యలు తీసుకోలేదు.. కాళేశ్వరంపై వాళ్లకు వాళ్లే గొప్పలు చెప్పుకుంటున్నారు.. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని అబద్ధం చెప్పి ప్రాజెక్టు రీడిజైన్‌ చేసి మేడిగడ్డకు మార్చారు.. కాళేశ్వరం ఖర్చు నాలుగు రెట్లు పెరిగితే నామమాత్రంగా ఆయకట్టు పెరిగిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయాల్సిన తప్పులన్నీ చేశారని.. ఇప్పుడు నోటీసులు ఇచ్చినందుకు భయపడుతున్నారని విమర్శించారు. అనుమానాలు ఉంటే కమిషన్‌కు ఎందుకు ఆధారాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. మీరు చేసిన ఎఫ్‌ఐఆర్‌నే కొనసాగిద్దామని.. నిజాయితీ నిరూపించుకోండి అని ఉత్తమ్ సవాల్ చేశారు. లేకపోతే మీపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్టును రీడిజైన్ చేశారు.. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారు.. దీంతో ఖర్చు నాలుగు రెట్లు పెరిగిందని అన్నారు. తీరా చూస్తే కాళేశ్వరం వైట్ ఎలిఫెంట్ అని కాగ్ నివేదిక ఇచ్చిందన్నారు. ప్రాజెక్ట్‌ను తిరిగి ఆపరేషన్‌లోకి తీసుకురావాలని రాజకీయాలకు అతీతంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కానీ.. అస్సలు కుదరడం లేదని అన్నారు. ఫౌండేషనే సరిగా లేదని అన్నారు. ఒక్క టెస్ట్ కూడా పాజిటివ్‌గా లేదని తెలిపారు. ప్రపోజల్ ఒకచోట అయితే.. కట్టింది మరోచోట అని అన్నారు.

కాగా, కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు జరిగాయని గుర్తించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇటీవల అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావులకు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో కమిషన్‌ ఎదుట హాజరుకావాలని పేర్కొంది.

Next Story