కట్టలు తెంచుకున్న మంత్రి ఉత్తమ్ కోపం.. హరీష్ రావుపై ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-05 16:03:52  IST  )

ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్‌కు చులకనభావం ఉందని.. చట్టసభలు, న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేదని.. వాటి మీద నమ్మకం కూడా లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

కట్టలు తెంచుకున్న మంత్రి ఉత్తమ్ కోపం.. హరీష్ రావుపై ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్‌కు చులకనభావం ఉందని.. చట్టసభలు, న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేదని.. వాటి మీద నమ్మకం కూడా లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో నియమించిన జ్యుడీషియల్ కమిషన్ అంటే కూడా లెక్కలేదని తెలిపారు. ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇప్పటికీ వాళ్లలో మార్పు రాలేదని.. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పుకోవాలనే సోయి కూడా లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన ఎన్డీఎస్ఏ మీద వారికి నమ్మకం లేదని తెలిపారు. మేడిగడ్డను కుంగబెట్టిన దుర్మార్గులు ఇప్పుడు ఏకంగా సీనియర్ జస్టిస్ పీసి ఘోష్‌ను అవమానిస్తున్నారా..? అని ఫైర్ అయ్యారు.

కాళేశ్వరం అక్రమాలు వెలుగులోకి..

కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలకు పాల్పడింది.. ఎన్ని అక్రమాలకు పాల్పడిందో జ్యుడీషియల్ కమిషన్ విచారణలో బయటపడిందని ఉత్తమ్ తెలిపారు. అప్పటి సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు భండారం బట్టబయలైందని పేర్కొన్నారు. అందుకే తేలు కుట్టిన దొంగల్లా.. హరీశ్‌రావు మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని పేర్కొన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించిందని.. అది రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాసిన రిపోర్టు కాదనే విషయాన్ని హరీశ్‌రావు మరిచిపోయినట్లున్నారని పేర్కొన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన మొదలైనప్పటి నుంచి డిజైన్లు, నిర్మాణంలో లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వరకు జరిగిన అవకతవకలన్నింటిపై కమిషన్ సమగ్రంగా విచారణ జరిపిందని తెలిపారు. ఎవరెవరు తప్పులు చేశారో.. ఎవరెవరు అందుకు బాధ్యులనే వివరాలను కూడా ఈ నివేదికలో వెల్లడించిందని పేర్కొన్నారు.

ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు?

తామేం తప్పు చేయలేదని పార్టీ ఆఫీసులో తప్పులు మాట్లాడి తెలంగాణ ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారని ఉత్తమ్ నిలదీశారు. కేసీఆర్, హరీశ్‌రావును సైతం పీసీ ఘోష్ కమిషన్ విచారించిందని.. వారిద్దరూ స్వయంగా జ్యుడీషియల్ కమిషన్ ఎదుట హాజరయ్యారని.. ఇప్పుడు పార్టీ ఆఫీసులో పెడబొబ్బలు పెడుతున్న హరీశ్‌రావు.. ఆ రోజు కమిషన్ ముందు ఎందుకు ఈ వివరాలు చెప్పుకోలేదని ప్రశ్నించారు. హరీశ్ అబద్ధపు సాక్ష్యాలు, బుకాయింపులన్నీ.. న్యాయ వ్యవస్థ ముందు అబద్ధాలుగా తేలిపోయాయని తెలిపారు. ఆయన చేసిన తప్పులన్నీ బయటపడ్డాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం చర్యలపై భయం

ఇప్పుడు ప్రభుత్వం ఈ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే భయం వాళ్లను వెంటాడుతున్నదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే.. పార్టీ ఆఫీసుకు వచ్చి ఏకంగా జ్యుడీషియల్ కమిషన్‌ను తప్పుబట్టే దుర్మార్గానికి ఒడిగట్టారని ఆరోపించారు. న్యాయబద్ధ కమిషన్‌కు అపార్థాలు అంటగట్టే నీచానికి దిగజారటం కూడా మీకే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ కమిషన్ తేల్చిన విషయాలపై, ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని ప్రజా ప్రభుత్వం ప్రకటించిందని.. అది ప్రజాస్వామ్య వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు, చట్ట సభలపై తమకున్న గౌరవమని తెలిపారు. అందుకే అసెంబ్లీలో ఈ నివేదికను చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కాళేశ్వరంలో దోషులుగా తేలిన బాధ్యులు.. అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని కూడా తమ ప్రభుత్వం ఆహ్వానించిందని పేర్కొన్నారు. ఫాంహౌస్‌లో మామ డైరెక్షన్, పార్టీ ఆఫీస్‌లో అల్లుడి యాక్టింగ్ ఇకనైనా ఆపాలని సూచించారు. అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులు ఒప్పుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాలని డిమాండ్ చేశారు. మీరు వేలకోట్ల అవినీతి చేస్తే ఒప్పు.. తాము విచారణ చేసి నిజాలు నిగ్గుతేలిస్తే అది రాజకీయ కక్ష సాధింపా అని ప్రశ్నించారు. కమీషన్ల కక్తుర్తితో ప్రజలను, రైతులను పదేళ్లపాటు మోసం చేశారని.. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతులు ఇస్తే దాచిపెట్టారని ఆరోపించారు. నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీల నిర్మాణం వద్దని చెపితే తొక్కిపెట్టారని.. బ్యారేజీలు ఎక్కడ కట్టాలో మీరే నిర్ణయించుకున్నారని తెలిపారు. కుంగి పోయే ప్రాజెక్ట్ కట్టినందుకు సిగ్గుపడాల్సింది పోయి హరీశ్‌రావు కొత్త రికార్డు సృష్టించారని ఎద్దేవాచేశారు. ఒక్క మాట కూడా నిజం చెప్పకుండా డూప్ ప్రెజెంటేషన్ మరోసారి ఇచ్చారని పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలోనే కొడంగల్‌కు జీవో

నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్‌కు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో ఇచ్చారని.. తమ ప్రభుత్వం ఒక్క రూపాయి బిల్లు కూడా ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు ఇవ్వలేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇక్కడే కాదు.. ఎక్కడైనా భూసేకరణ పూర్తి కాకుండా ఒక్క రూపాయి బిల్లు ఇవ్వకూడదని మా ముఖ్యమంత్రి స్పష్టమైన అదేశాలు జారీ చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండానే మామాఅల్లుళ్లు సంతకాలు చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. తెలంగాణ ప్రజలను దగా చేశారని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను పాతరపెట్టి, ఆర్థికంగా లక్ష కోట్ల దుర్మార్గానికి ఒడిగట్టిన బీఆర్ఎస్ లీడర్లకు నైతికంగా మాట్లాడే హక్కు కూడా లేదని సూచించారు.

Next Story