- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్‌ఎల్‌బీసీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
ఎస్ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణకు ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణకు ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఎస్ఎల్‌బీసీ పునరుద్ధరణ పనుల పురోగతిపై బుధవారం సెక్రెటేరియట్‌లో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని సంకల్పించినట్లు చెప్పారు. అందులో భాగంగా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు. అందులో భాగంగానే గురువారం సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం కానున్నట్లు తెలిపారు. నెలకు 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకుని.. జనవరి 2028 నాటికి పూర్తిచేస్తామని ప్రకటించారు. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగమార్గానికి గాను ఇప్పటికే 35 కిలోమీటర్లు పూర్తయ్యిందని చెప్పారు. మిగిలిన తొమ్మిది కిలోమీటర్లు తవ్వడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ప్రపంచం మొత్తంలో అత్యాధునిక సాంకేతికతో కూడిన హెలీ-బోర్న్ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ద్వారా ఈ సర్వే నిర్వహించ తలపెట్టినట్లు ఆయన తెలిపారు. తద్వారా సొరంగ మార్గం తవ్వకాల సమయంలో ప్రమాదాలను ముందుగానే పసిగట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు ఇంజినీర్లకు ఉంటుందన్నారు.
నీటిపారుదల సలహా దారుడిగా లెఫ్టినెంట్ జెనరల్ హార్పల్ సింగ్ నియామకం ఈ సొరంగ మార్గం పూర్తికి దోహద పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు షిఫ్ట్‌లలో పనిచేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటే నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి అవుతాయన్నారు. ఆయా షిఫ్ట్‌లలో యువ ఇంజినీర్లను నియమించి రోజువారీ పురోగతిని రికార్డ్ చేయాలన్నారు. తవ్వకాల సమయంలో వస్తున్న నీటిని పంపింగ్ చేయడానికి విద్యుత్ బిల్లులు ఏడాది రూ.500 నుండి రూ.550 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. పైగా పంపింగ్ కోసం వినియోగిస్తున్న మోటార్లు 20 సంవత్సరాలు పూర్తికావడంతో అదనపు భారాన్ని భరిస్తూ మోటార్లను మార్చాల్సి వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తయితే రోజుకు 0.3 టీఎంసీల నీటిని 90 రోజులపాటు అందించవచ్చన్నారు. అలాగే.. ఏపీ అనధికారికంగా పోతిరెడ్డిపాడుకు తరలించుకుపోయే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ప్రాజెక్టును పూర్తి చేసే అంశంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్, హార్పల్ సింగ్, సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్, ఈఎన్సీలు అంజద్‌హుస్సేన్, శ్రీనివాస్, రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.






