ఒకే ఒక్క కుటుంబం వల్ల తెలంగాణ సర్వనాశనం.. మంత్రి ఉత్తమ్ ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) పదేళ్ల పాలన, కేసీఆర్(KCR) కుటుంబంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒకే ఒక్క కుటుంబం వల్ల తెలంగాణ సర్వనాశనం.. మంత్రి ఉత్తమ్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) పదేళ్ల పాలన, కేసీఆర్(KCR) కుటుంబంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన నల్లగొండ కలెక్టర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న ఓ కుటుంబం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. కుటుంబ పాలన, అవినీతితో రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు. సాగునీటి రంగంలో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల కమీషన్ కక్కుర్తి వల్లే కాళేశ్వరం నాణ్యత లోపించిందని మండిపడ్డారు. రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. మూడేళ్లలోనే కూలిపోవడం దారుణమన్నారు. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి, రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు పనికిరావని ఎన్‌ఎస్‌డీఏ చెప్పిందని గుర్తుచేశారు.

అంతేకాదు.. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని ఒప్పుకుని రాష్ట్రానికి కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణకే 500 టీఎంసీలు కేటాయించాలని ఈ ప్రభుత్వం పోరాడుతోందని తెలిపారు. కాళేశ్వరంపై రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. అదనంగా ఒక్క ఎకరం కూడా సాగులోకి రాలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దోపిడీ విధానం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. పాలమూరు - రంగారెడ్డి, డిండి, సీతారామ ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సీరియస్ అయ్యారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళలు ఇలా అందరినీ కేసీఆర్ ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి.. కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఉన్న రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చుకునేందుకు కూడా వీళ్లేకుండా చేశారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఎన్నో పనులు చేశామని అన్నారు.

Next Story