Minister Uttam: ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-15 18:27:27  IST  )

కృష్ణా జలాలతో ఏపీ నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Minister Uttam: ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా జలాలతో ఏపీ నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతర్ రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం ఆర్ఎల్ఐసీ నిర్మాణం చేపట్టిందని కేంద్రం వద్ద తాను పలుమార్లు రాష్ట్రం తరపున వాదనలు వినిపించడంతోపాటు రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేఆర్‌ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మించాలన్నది ఏపీ లక్ష్యమని తెలిపారు. పర్యావరణ చట్టాలను కుడా కాదని వారు ఈ ప్రాజెక్టును మొదలు పెట్టారని పేర్కొన్నారు.

కీలక సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కాపాడేందుకు చర్యలు తీసుకుందని తెలిపారు. అందులో భాగంగానే నీటిపారుదల అధికారులు ఎన్‌జీటీ, ఎంఓఎఫ్, సీసీలతో పాటు కేఆర్ఎంబీ, కేడబ్ల్యూడీటీ-2 వద్ద పటిష్టమైన వాదనలు వినిపించినట్లు తెలిపారు. కేంద్ర పర్యావరణ మంత్రితో వ్యక్తిగతంగా మాట్లాడి సమగ్రంగా వివరించిన నేపథ్యాన్ని గుర్తుచేశారు. ఫిబ్రవరి 27న జరిగిన 25వ సమావేశంలో ఎన్జీటీ ఉత్తర్వులను సమీక్షించి నిబంధనలు ఉల్లంఘించి ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చుట్టినట్లు నిర్ధారించారని.. అందుకే ఈ నిర్ణయం వెలువరించారని తెలిపారు. ఈ నిర్మాణాన్ని తాము అడ్డుకోకుంటే రాష్ట్రంలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో సాగు, తాగునీటికి దుర్భర పరిస్థితి ఏర్పడేదని స్పష్టం చేశారు. అలాగే కృష్ణా జలాశయాలలో హక్కు కోల్పోకుండా చూడడంతోపాటు విధాన పరమైన పోరాటం చేస్తామని మంత్రి తెలిపారు.

Read More..

రాజకీయ ప్రభల కోలాహలం

Next Story