ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి.. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి ఉత్తమ్ కీలక పిలుపు

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-11 12:58:58  IST  )

కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు(Graduate MLC Elections) కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు.

ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి.. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి ఉత్తమ్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు(Graduate MLC Elections) కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో కేడర్‌ను, లీడర్‌ను అప్రమత్తం చేసి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి(Narender Reddy) విజయానికి రూట్ మ్యాప్ రూపొందించుకోవాలని నేతలకు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలు రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు రిహార్సల్స్ అవుతాయన్నారు.

ఈ ఎన్నికల ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించేందుకు దోహద పడుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకంగా మారుతుందని.. క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేయగలిగితే గెలుపు నల్లేరు మీద నడక అవుతుందన్నారు. తద్వారా రేపటి స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో సైతం పార్టీ గెలుపుకు మార్గం సునాయాసం అవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ప్రభుత్వం సాధించిన విజయాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం వ్యవధిలోనే జరిగిన ఉపాధ్యాయ నియామకాలు మొదలు ప్రభుత్వం భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యగాల నియామకాలను విద్యార్థి, యువతకు వివరించాలన్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం పరంగా సనస్యలు తన దృష్టికి తీసుక రాగలిగితే సత్వరం పరిష్కరించేందుకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులకు, పార్టీ యంత్రాంగానికి నిరంతరం అందుబాటులో ఉంటానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు దుద్దిళ్ల శ్రీదర్ బాబు, పొన్నం ప్రభాకర్లతో పాటు శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, రాజ్ ఠాకూర్, డాక్టర్ సంజయ్, వెలిచాల రాజేందర్ రావు, మేడిపల్లి సత్యం, వడితేల ప్రణవ్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story