కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి ఉత్తమ్ లేఖ

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న వరి ఉత్పత్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తన సేకరణ లక్ష్యాలను పెంచడం లేదని రాష్ట్ర సాగునీటి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి ఉత్తమ్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న వరి ఉత్పత్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తన సేకరణ లక్ష్యాలను పెంచడం లేదని రాష్ట్ర సాగునీటి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఆయన ఘాటైన లేఖ రాశారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడానికి, మద్దతు ధర కల్పించడానికి కేంద్రం తక్షణమే మూడు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. 2024-25 రబీ కాలానికి సంబంధించి ఎఫ్‌సీఐ, రా రైస్ లక్ష్యాన్ని, దానికి బదులుగా 5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని కేటాయించాలని మంత్రి కోరారు. ప్రస్తుతం ఇంకా 8.45 ఎల్‌ఎంటీ బియ్యం డెలివరీ చేయాల్సి ఉందని, దీని గడువు ఫిబ్రవరి 28తో ముగిసినందున, మరో 60 రోజుల పొడిగింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2025-26 ఖరీఫ్, రబీ సీజన్ల కోసం బాయిల్డ్ రైస్ సేకరణ లక్ష్యాన్ని మరో 20 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఉత్పత్తికి అనుగుణంగా ఈ పెంపు అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ధాన్యానికి బాయిల్డ్ రైస్ తయారీకి అనువైన లక్షణాలు ఉన్నాయని, కేవలం 5 శాతం నూకలతో నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేసేందుకు మిల్లర్లు కూడా సిద్ధంగా ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.

ఖరీఫ్ ధాన్యం నిల్వల ఫిజికల్ వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉండటం, మిల్లింగ్‌కు అదనపు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. 2024-25 రబీ డెలివరీలకు మరో రెండు నెలల గడువు ఇవ్వాలని కోరారు. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సాగునీటి వసతులు మెరుగుపడటంతో వరి సాగు అనూహ్యంగా పెరిగిందని మంత్రి వివరించారు. అయితే, కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఎఫ్‌సీఐకి డెలివరీ చేసే బాయిల్డ్ రైస్ శాతం 2024-25 నాటికి 66.78 శాతానికి పడిపోయిందన్నారు. కేంద్రం లక్ష్యాలను తగ్గించడం వల్ల అదనపు ధాన్యం నిల్వలు, నిల్వ ఖర్చులు, మిల్లింగ్ ఛార్జీలు, వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోందన్నారు. లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను కాపాడటం మా బాధ్యత. కానీ, కేంద్రం నుండి సరైన సహకారం లేకపోతే రాష్ట్రం ఈ ఆర్థిక భారాన్ని నిరంతరం మోయడం కష్టం" అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించాలని ఆయన తన లేఖలో కోరారు.

Next Story