దేశ ఆవిష్కరణ రంగంలో తెలంగాణ ముందంజ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Ramesh Naini |

విజ్ఞానం ప్రయోగశాలల గోడలకే పరిమితం కాకుండా ఆవిష్కరణలు ప్రాయోజిక ఫలితాలుగా మారాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

దేశ ఆవిష్కరణ రంగంలో తెలంగాణ ముందంజ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : విజ్ఞానం ప్రయోగశాలల గోడలకే పరిమితం కాకుండా ఆవిష్కరణలు ప్రాయోజిక ఫలితాలుగా మారాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ ప్రస్తుతం కీలకమైన డీప్-టెక్ క్షణంలో నిలిచిందని, కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్ వ్యవస్థలు, వాతావరణ సాంకేతికతలు, ఆధునిక తయారీ, భౌగోళిక మేధస్సు వంటి రంగాల్లో జరుగుతున్న పురోగతులు దేశ పోటీతత్వాన్ని నిర్ణయిస్తాయని అభిప్రాయ పడ్డారు. శనివారం జాతీయ సైన్స్ డే సందర్భంగా రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ నిర్వహించిన సస్టైనబుల్ భారత్ 2047 కోసం పరిశోధన,డీప్ టెక్నాలజీల జాతీయ సదస్సుకు హాజరై ప్రసంగించారు. భారత్ 2047 నాటికి సాంకేతిక స్వావలంబన కలిగిన, పరిశోధన ప్రాధాన్యత ఉన్న, సుస్థిరత ఆధారిత దేశంగా ఎదగాలని, వినియోగంతో కాదు, సృష్టితో శాశ్వత వృద్ధి సాధ్యమైతుందన్నారు. డీప్ టెక్నాలజీలు ఐచ్ఛికం కాదని, అవి జాతీయ పురోగతికి అత్యవసరమని నేటి పరిశోధనలో పెట్టుబడి పెట్టే దేశాలే రేపటి నాయకులవుతాయని పేర్కొన్నారు. పరిశ్రమలు వాస్తవ సమస్యలను గుర్తించడంతో పాటు, అకాడెమియా మిషన్ మోడ్‌లో స్పందించి ప్రభుత్వం అనుకూల విధానాలను అమలు చేయాలని సూచించారు.

దేశ ఆవిష్కరణ రంగంలో ముందంజ

తెలంగాణ దేశ ఆవిష్కరణ రంగంలో ముందంజలో ఉందని హైదరాబాద్ రక్షణ పరిశోధన, బయోటెక్నాలజీ, ఔషధ తయారీ, ఏరోస్పేస్ రంగాల్లో కీలక కేంద్రంగా ఎదిగిందన్నారు. పరిశోధనను వ్యాపారంగా మార్చే విధానాలు, స్టార్టప్‌లకు మద్దతు, ఉపాధి సృష్టి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. విశ్వవిద్యాలయాలు డిగ్రీల కర్మాగారాలుగా కాకుండా మేధో సంపత్తి, స్టార్టప్ ఇంక్యుబేషన్, సాంకేతిక వాణిజ్యీకరణకు కేంద్రాలుగా మారాలని పిలుపునిచ్చారు. పరిపాలన కూడా విజ్ఞాన ఆధారంగా మారాలని, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఏఐ ఆధారిత నిర్ణయ వ్యవస్థలు, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ద్వారా ప్రజాసేవలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. సస్టైనబుల్ భారత్‌కు సమర్థవంతమైన, వాతావరణ స్పందన కలిగిన, డిజిటల్‌గా అనుసంధానమైన మౌలిక వసతులు అవసరమన్నారు. భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా ఉందని, పరిశోధన సామర్థ్యం, విమర్శనాత్మక ఆలోచన, ప్రయోగ సంస్కృతి పెంపొందితేనే అది జాతీయ శక్తిగా మారుతుందని తెలిపారు. డిగ్రీ సంస్కృతి నుంచి డిస్కవరీ సంస్కృతికి మారాలి.. పరీక్షల కేంద్రిత దృష్టి నుంచి ప్రయోగాల కేంద్రిత దృష్టికి అడుగులు వేయాలి.. సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి ఆవిష్కరణ ఆధారిత వ్యవస్థగా మారాలని సూచించారు. విజ్ఞానం పరిశ్రమలను బలోపేతంతో పాటు పరిపాలనను ఆధునీకరించి యువతను శక్తివంతం చేసి దేశ భవిష్యత్తును భద్రపరచాలని తెలిపారు.

Next Story