- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరు-రంగారెడ్డికి క్లియరెన్స్ తేవాలి: మంత్రి ఉత్తమ్
పాలమూరు-రంగారెడ్డికి క్లియరెన్స్ తేవాలి: మంత్రి ఉత్తమ్

దిశ, తెలంగాణ బ్యూరో: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ క్లియరెన్స్ తీసుకువచ్చే దిశగా కృషి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సాగునీటి శాఖ అధికారులతో సెక్రెటేరియట్‌లోని తన చాంబర్‌లో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెండింగులో ఉన్న ప్రాజెక్టులు.. కేంద్రం వద్ద పెండింగులో ఉన్న ప్రాజెక్టులపై కీలకంగా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాలమూరు-రంగారెడ్డికి క్లియరెన్స్ తీసుకురావాలన్నారు. క్లియరెన్స్ వచ్చాక మొదటి ప్రాధాన్యతగా ప్రాజెక్టును పూర్తిచేయాలన్నారు. అలాగే.. సమ్మక్క సారక్క ప్రాజెక్టుపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఈ ప్రాజెక్టుకు సైతం సీడబ్ల్యూసీ క్లియరెన్స్ లేకపోవడంతో.. దాని పురోగతిపై మంత్రి అధికారులతో డిస్కస్ చేశారు.
రెండు నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్
మరోవైపు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును ఎంతగానో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. దాంతో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం చర్చలు నిర్వహించింది. మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టుపై అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని నిర్మించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ప్రాజెక్టు నిర్మాణ ఎత్తు విషయంలో ఇరు రాష్ట్రాల ప్రతిష్టంభన నెలకొని ఉండడంతో.. కొద్ది రోజుల్లోనే దానికి బ్రేక్ వేసే దిశగా సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ప్రయత్నాలు చేస్తున్నారు. తొందరలోనే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ శనివారం నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రెండు నెలల్లోనే ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే.. డీపీఆర్ తయారీకి మూడు నెలల సమయం పడుతుందని అధికారులు చెప్పినప్పటికీ.. రెండు నెలల్లోనే ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. దాంతో రెండు నెలల్లోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం పూర్తిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాళేశ్వరం బ్యారేజీలకు మరమ్మతు చేయాలి
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి గత అసెంబ్లీ ఎన్నికల వేళ డ్యామేజీ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు పియర్లు కుంగి ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి వెళ్లిపోయింది. మేడిగడ్డతోపాటే సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులకు సైతం డ్యామేజీ జరిగింది. దాంతో అప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలో లేకుండాపోయింది. అయితే.. ఆ ప్రాజెక్టుకు సైతం మరమ్మతులు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుపై ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ఆధారంగా బ్యారేజీలకు మరమ్మతులు చేయించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అయితే.. దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. మరోవైపు రిపేరుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం టెండర్లను సైతం ఆహ్వానించింది. వీలైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తిచేసి ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే ప్రారంభించాలని మంత్రి తాజాగా సూచించారు. అలాగే.. ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపైనా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. గతంలో ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు మొగ్గు చూపగా.. ఆ నిర్ణయాన్ని విరమించుకొని తాజాగా పోలవరం-నల్లమలసాగర్‌ను తెరమీదకు తెచ్చింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ కోసం టెండర్లనూ ఆహ్వానించింది. అయితే.. డీపీఆర్ అంశంపై ఈ సమావేశంలో కీలక చర్చించనట్లు అధికారులు తెలిపారు. మరోసారి కేంద్రం వద్దనే ఈ అంశంపై తేల్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు చెప్పారు.
10న సీఎం సమీక్ష!
ఈ నెల 10వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. అందులోభాగంగానే మంత్రి ఈ సమీక్ష సమావేశం నిర్వహించారని తెలిసింది. అలాగే.. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులపై కేంద్రానికి పంపించే లేఖలపైనా ఇందులో చర్చించారు. ఐఎస్‌డబ్ల్యూఆర్ విభాగం, సీడీఓ విభాగాల బలోపేతంపైనా అధికారులతో చర్చించారు. సాగునీటి శాఖలో ఉద్యోగుల పదోన్నతులు కల్పించడంపైనా ప్రత్యేక చర్చ జరిగినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో ఇద్దరు ఇంజినీర్ల నియామించేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.






