తెలంగాణలోని ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం: మంత్రి ఉత్తమ్‌ ప్రకటన

by Gantepaka Srikanth |

జె.చొక్కారావు దేవాదుల ప్రాజెక్ట్(Devadala Project) పూర్తికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణలోని ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం: మంత్రి ఉత్తమ్‌ ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: జె.చొక్కారావు దేవాదుల ప్రాజెక్ట్(Devadala Project) పూర్తికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయడమే తమ ముందున్న కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. జే.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పురోగతిపై మంగళవారం సెక్రెటేరియట్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్ణీత కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. పాలనాపరమైన అడ్డంకులను సత్వరం తొలగించి పెండింగ్ పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గంగారాం గ్రామ సమీపంలోని గోదావరి నది నుండి 38.16 టీఎంసీల నీటిని వరంగల్, హన్మకొండ, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, యాదాద్రి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలలో 5.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందించినట్లు వివరించారు. 71 మీటర్ల ఎత్తు నుండి 540 మీటర్ల ఎత్తు వరకు మొత్తం 469 మీటర్ల మేర ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నట్లు తెలిపారు. పంప్‌హౌస్ లు, కాలువల తవ్వకాలు, నీటి సరఫరా తదితర పనులు పూర్తి చేసేందుకు మూడు దశలలో పనులు జరుగుతున్నాయన్నారు.

5.56 లక్షల ఎకరాలు సాగులోకి..

5.56 లక్షల ఎకరాలను సాగులోకి తేవడానికి దేవాదుల ప్రాజెక్ట్ రూపొందించనట్లు తెలిపారు. ఇప్పటివరకు 3.17 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామన్నారు. భూగర్భజలాలతో సాగులో ఉన్న 58,028 ఎకరాల విస్తీర్ణంతో కలుపు కుంటే మొత్తం ఆయకట్టు 6.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మిగిలిన పనుల పూర్తికి 4,230 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. నిర్మాణానికి గాను రూ.11,667.85 కోట్లు ఖర్చు చేయగా భూసేకరణ నిమిత్తం రూ.1,343.06 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. హైడ్రో మెకానికల్ విద్యుత్ అవసరాల నిమిత్తం 1,170.63 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. 2,430 కిలోమీటర్ల కాలువ తవ్వాల్సి ఉండగా 1,663.10 కిలోమీటర్లు తవ్వకాలు పూర్తి అయ్యాయని, అదేవిధంగా 702.62 కిలోమీటర్ల పైపులైన్‌కు గాను ఇప్పటికి 669.66 కిలోమీటర్ల మేర పూర్తి చేశారని కాలువల లైనింగ్ సైతం 799.80 కిలోమీటర్లు పూర్తయ్యిందని ఆయన చెప్పారు. 46 ట్యాంక్‌లకు గాను 39 పూర్తి కాగా 21 పంప్ హౌజ్‌లలో 18 ట్యాంకులు పురోగతిలో ఉన్నాయన్నారు. ప్రాజెక్టు మొదటి దశలో 170 రోజులపాటు 5.18 టీఎంసీల నీటిని పంపిణీ చేయగా 1.23 లక్షల ఎకరాలకు సాగునీరు సమృద్ధిగా అందుతుందన్నారు. రెండో దశలో 7.25 టీఎంసీల నీటితో మరో 1.83 లక్షల ఎకరాలకు నీరు అందించాలన్న లక్ష్యంతో పనులు వేగవంతం చేస్తున్నామన్నారు.

జనగామ జిల్లాలో, రఘునాథపల్లి, ఆర్ఎస్ ఘనపూర్ విభాగాలలో 51,000 ఎకరాలతో సహా సుమారు 88,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తాటికొండ, కొత్తపల్లి, మీదికొండ, రాఘవపూర్, చాగల్, అశ్వారాపల్లి, గోవర్ధనగిరి వంటి ఏడు గ్రామాలలో కేవలం గాంధిరామారం రైట్ మెయిన్ కెనాల్ సుమారు 5,600 ఎకరాలకు నీరందిస్తుందన్నారు. హన్మకొండ, వరంగల్ నియోజకవర్గాలలో ఆయకట్టు సామర్థ్యం 1.1 లక్షల ఎకరాలను మించిపోయిందని.. ములుగు, భూపాలపల్లి, జయశంకర్ విభాగాలు కలిపి 1.2 లక్షల ఎకరాలకుపైగా ఉన్నాయన్నారు. మిగిలిన ఆయకట్టు సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలలో పంపిణీ చేయబడిందని, తద్వారా ఈ ప్రాజెక్టు ఉత్తర మరియు మధ్య తెలంగాణ రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు నాగరాజు, యశశ్వనిరెడ్డి, సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సలహాదారు ఆదిత్య నాథ్‌దాస్, సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్, ఈఎన్సీలు అమ్జద్‌హుస్సేన్, రమేశ్‌బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story