TG: ఉద్యోగాల భర్తీపై మంత్రి ఉత్తమ్ కీలక హామీ

by Gantepaka Srikanth |

ఉద్యోగాల భర్తీపై మంత్రి ఉత్తమ్ కీలక హామీ

TG: ఉద్యోగాల భర్తీపై మంత్రి ఉత్తమ్ కీలక హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: నీటిపారుదల శాఖలో ఆధునిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తేవాలని.. సెంట్రల్ డిజైన్ విభాగం పటిష్ఠతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సెక్రెటేరియట్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మేడిగడ్డ ఉదంతంలో జాతీయ భద్రత సంస్థతోపాటు జస్టిస్ ఘోష్ కమిషన్ చేసిన వ్యాఖ్యలతో సీడీఓ ప్రతిష్ట దెబ్బతిన్నదని అన్నారు. అటువంటి వ్యాఖ్యలపై సీడీఓ పునఃసమీక్షించుకుని సంస్కరణలు చేపట్టడం అత్యవసరమని సూచించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సీడీఓను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పనలో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అందుకు అవసరమైన లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఒకప్పుడు సీడీఓ ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.

వందేళ్ల క్రితం నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి మొదలు పెడితే ఉభయ తెలుగు రాష్ట్రాలలో నిర్మించిన ప్రధాన ప్రాజెక్ట్ నిర్మాణాలలో వినియోగించిన సాంకేతికత తెలంగాణ సీడీఓ ప్రతిభకు పట్టం కడుతుందన్నారు. అటువంటి ప్రతిభ చాటేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే.. సీడీఓలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఐఐటీలు, ఎన్ఐటీ నుంచి నీటిపారుదల శాఖలో నియమితులైన ఇంజినీర్లకు సీడీఓలో పోస్టింగ్ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నవి కావడంతో ప్రతిభావంతులైన ఇంజినీర్ల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్దిష్టమైన ఇంజినీరింగ్, సృజనాత్మక అవసరమని.. అది అత్యుత్తమ శిక్షణ పొందిన నిపుణుల ద్వారానే సాధ్యపడుతుందని చెప్పారు. పదవీ విరమణ పొందిన అనుభవం కలిగిన వారి సేవలు కుడా వినియోగించుకుని అద్భుతమైన ఫలితాలు రాబట్టాలన్నారు.

నెల్లికల్లు, డిండి డిజైన్లు ఫైనల్ చేయాలి..

నీటిపారుదల శాఖ చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలక్ట్రోమెకానికల్ ఇంజినీరింగ్ ప్రాముఖ్యత మునుముందు మరింత పెరగబోతున్నదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. దాంతో లోతైన పరిజ్ఞానం కలిగి ఉన్న నిపుణులను నియమించడం ద్వారా సీడీఓ తిరిగి పూర్వవైభవం చాటుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఐఐటీ హైదరాబాద్, జేఎన్టీయూ, టీఎస్ జెన్ కో వంటి సంస్థలకు చెందిన వారిని నియమించే ముందు టైంబౌండ్ పద్ధతిలో డిజైన్ల రూపకల్పనలో ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శించడంతోపాటు సమయపాలనకు పెద్దపీట వేయాలన్నారు. నల్లగొండ జిల్లాలో నెల్లికల్లు, డిండి ఎత్తిపోతల పథకాల డిజైన్లను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఆలస్యం అయ్యే కొద్దీ రైతులకు నీరు అందించడంలో జాప్యం జరుగుతుందని చెప్పారు. డిజైన్లను తక్షణం ఆమోదించాలని ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.

Next Story