Minister Uttam: వరద నష్టాలపై అలర్ట్‌గా ఉండాలి.. అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు

by Gantepaka Srikanth |

వరద సంబంధిత నష్టాలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు.

Minister Uttam: వరద నష్టాలపై అలర్ట్‌గా ఉండాలి.. అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరద సంబంధిత నష్టాలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు. వరద నష్టం నివేదికలో 117 ట్యాంకులు, కాలువలు, లిఫ్ట్‌లకు పగుళ్లు సంభవించాయని.. వీటి పునరుద్ధరణకు రూ.335 కోట్లకు పైగా అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. మంత్రి ఉత్తమ్ మంగళవారం నీటిపారుదల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్, ములుగు, మహబూబ్‌నగర్, సూర్యాపేట వంటి జిల్లాల్లో నష్టం సంభవించినట్లు తెలిపారు. శాశ్వత పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని.. వరద నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. జలాశయాలలోకి పెరుగుతున్న నీటి ప్రవాహాలపై నిఘా ఉంచాలని, వరద నష్టానికి నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రధాన జలాశయాల స్థితిని సమీక్షించిన మంత్రి కృష్ణా బేసిన్‌లోకి నీటి ప్రవాహాలు గణనీయమైన స్థాయికి చేరుకున్నాయని అన్నారు. అలాగే.. గోదావరి బేసిన్‌లో కీలక ప్రాజెక్టులలో భారీగా ఇన్‌ఫ్లోలు నమోదవుతున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 34,740 చెరువుల్లో 12,023 మిగులు నిల్వలు ఉండగా, 9,100 కంటే ఎక్కువ ట్యాంకులు వాటి సామర్థ్యంలో 75 నుంచి 100 శాతం వరకు నిండి ఉన్నాయని తెలిపారు. పంట క్యాలెండర్ల ప్రకారం రైతులకు సాగు నీరందించాలని ఇంజినీర్లను ఆదేశించారు. కడెం, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ ప్రాజెక్టులలో నీటిని గరిష్టంగా ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. ఏడాది పొడవునా నీరు తగినంతగా ఉండేలా చిన్న నీటిపారుదల ట్యాంకులను నింపాలని ఆదేశించారు.

నేడు ప్రాజెక్టుల సందర్శన

వర్షం, వరద పరిస్థితిని అంచనా వేయడానికి బుధవారం పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్, నిజామాబాద్‌లోని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేర్ ప్రాజెక్ట్‌లను సందర్శిస్తానని మంత్రి తెలిపారు. లోతట్టు ప్రాంతాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందుగానే వారిని సహాయ కేంద్రాలకు తరలించాలన్నారు. అలాగే.. రైతుల సంక్షేమం తమ ప్రధానమని, అదే సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను రక్షించడం, తక్షణ సహాయం అందించడమే ముఖ్యమని చెప్పారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ (ఇరిగేషన్) రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అమ్జాద్ హుస్సేన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story