నల్లగొండ సస్యశ్యామలం.. డిసెంబర్ 2027 నాటికి ఎస్ఎల్‌బీసీ పూర్తి.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

ఎస్ఎల్‌బీసీని డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇందుకు రూట్ మ్యాప్ రూపొందించామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

నల్లగొండ సస్యశ్యామలం.. డిసెంబర్ 2027 నాటికి ఎస్ఎల్‌బీసీ పూర్తి.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని.. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న (SLBC) ఎస్ఎల్‌బీసీని డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇందుకు రూట్ మ్యాప్ రూపొందించామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar reddy) స్పష్టం చేశారు. మంగళవారం జలసౌధలో నల్లగొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాలలో ప్రాజెక్టుల పురోగతిపై ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎస్ఎల్‌బీసీ పూర్తితో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు సురక్షితమైన తాగునీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా హైలెవల్ కెనాల్ నుంచి లో లెవల్ కెనాల్ పనులు పూర్తిచేయడంతోపాటు ఎస్ఎల్‌బీసీ ప్రారంభం అయితే లోలెవల్ కెనాల్ పంప్ హౌజ్‌ల ద్వారా సరఫరా చేస్తున్న నీటి వినియోగానికి నెల వారీగా చెల్లిస్తున్న కోటి రెండు లక్షల విద్యుత్ భారం నుంచి బయట పడగలమని తెలిపారు. ఈ ప్రాజెక్టు పునరుద్ధరణపై ఇంజినీర్లు రూపొందించిన నివేదికను ఈ నెల 15న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించి పనులు మొదలు పెడతామని స్పష్టం చేశారు. అలాగే.. డిండి ఎత్తిపోతలతో 8 రిజర్వాయర్ల నుంచి 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా పనులు సాగుతున్నాయన్నారు.

సింగరాజ్‌పల్లి రిజర్వాయర్ ద్వారా 13,000 ఎకరాలకు, ఎర్రబెల్లి-గోకారం ద్వారా 6,000 ఎకరాలకు, ఇర్విన్ ద్వారా 10,000 ఎకరాలకు, గొట్టెముక్కల ద్వారా 28,000 ఎకరాలకు, చింతపల్లి ద్వారా 15,000 ఎకరాలకు, కృష్ణ రాంపల్లి ద్వారా లక్ష ఎకరాలకు, శివన్న గూడెం ద్వారా 1,55,000 ఎకరాలకు అందించేందుకు పనులు వేగవంతం చేస్తున్నామని ఆయన చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఎదుళ్ల రిజర్వాయర్ నుండి దుందుభి వాగు వరకు నీటిని రప్పించేందుకు ఐదు ప్యాకేజ్‌లుగా విభజించి పనులు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. అయితే.. అటవీశాఖ అనుమతులు ఇతరత్రా కారణంగా నిలిచిపోయిన చింతపల్లి, ఇర్విన్ రిజర్వాయర్ల పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నీటి లభ్యతను ఆధారం చేసుకుని కొత్తగా 11 ఎత్తిపోతల పథకాలు నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఒక్క మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోనే ఐదింటికి అనుమతులు మంజూరు చేయగా మిగిలిన చోట్ల మరో ఐదింటికి అనుమతించామన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాలువల పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గంధమళ్ల రిజర్వాయర్ పరిధిలోని రావెల్ కోల్ లింక్ కెనాల్, ప్యాకేజీ 16, తురకపల్లి కెనాల్, యం.తురకపల్లి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఎస్‌ఎల్‌బీసీని బీఆర్ఎస్ పట్టించుకోలేదు..

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్‌బీసీని పట్టించుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkata Reddy) అన్నారు. తాను 2005లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి ఎల్ఎల్‌బీసీ సొరంగానికి శ్రీకారం చుట్టామని.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ టన్నెల్ అని చెప్పారు. ఇది పూర్తయితే కృష్ణాలో అలొకేటెడ్ నీటిని గ్రావిటీ ద్వారా తెచ్చుకోవచ్చని.. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే గత ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. రాష్ట్రమంతా వర్షాలు పడ్డా.. నల్గొండ జిల్లాలో కట్టంగూరు, మునుగోడు, నార్కట్‌పల్లిలో వర్షాలు అతి తక్కువ పడ్డాయన్నారు. రూ.300 కోట్లు బ్రహ్మణ వెల్లెంల కోసం కేటాయించాలని కోరారు. 10 శాతం నిధులు.. సుమారు 3వేల కోట్లు ఖర్చు చేస్తే ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తవుతాయని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు బాలునాయక్, వేముల విరేశం, కుంభం అనిల్‌రెడ్డి, కుందూరు జయధీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామ్యూల్, నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్, హార్పల్ సింగ్, ప్రత్యేక అధికారి పరిక్షిత్ మెహ్రా, ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్‌నాయుడు, నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు ఇల త్రిపాఠి, మంత్రిప్రగడ హనుమంతరావు, తేజస్ నందలాల్ పవర్, ఈఎన్సీలు అంజద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేశ్‌బాబు, సీఈ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.

Next Story