- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు వేదికల వద్ద యూరియా సేల్ కౌంటర్లు.. పంపిణీ ప్రక్రియకు చర్యలు.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో రైతు వేదికల వద్ద అదనపు యూరియా సేల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో (Rythu Vedika) రైతు వేదికల వద్ద అదనపు యూరియా సేల్ కౌంటర్ల (urea sales counters)ను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువులు సులభంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా చేపట్టిన పంపిణీ విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద అదనపు యూరియా సేల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. మండలానికి ఒకటి నుంచి రెండు PACS ఉన్న ప్రాంతాల్లో రైతు వేదికలను వాడుకొని విక్రయాలు చేపట్టాలని సూచించారు. గ్రామాల వారీగా, పాస్ పుస్తకాల ఆధారంగా ఒక రోజు ముందుగానే రైతులకు టోకెన్లు జారీ చేసి, ఎరువులు అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగానే టోకెన్లు ఇవ్వడం ద్వారా రైతులు ఇబ్బందులు లేకుండా యూరియా పొందగలుగుతున్నారని మంత్రి తెలిపారు. ఈ పంపిణీ ప్రక్రియలో ఎక్కడా అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కోఆపరేటివ్, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించామని, పోలీస్, విజిలెన్స్ విభాగాలతో కూడిన పర్యవేక్షణలో ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో యూరియా పరిస్థితులను కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వానాకాలం సాగు విస్తారంగా సాగుతున్న నేపథ్యంలో రైతులు యూరియా ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నారని వివరించారు. యూరియా అవసరాన్ని వివరించడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, తూర్పు తీరంలోని వివిధ నౌకాశ్రయాలకు రానున్న నాలుగు దిగుమతి నౌకల నుంచి రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయించేందుకు అంగీకరించిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రైతులు ప్రస్తుత పంట దశలో సకాలంలో ఎరువులు పొందగలుగుతారని మంత్రి వెల్లడించారు. దిగుమతి సరఫరా కాకుండా, RFCL మూత పడటంతో కేంద్రం దేశీయ తయారీ యూనిట్ల నుంచి కూడా అదనంగా 30,000 మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించడానికి కేంద్రం అంగీకరించినట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఎరువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉంటుందని, అంతేకాకుండా రామగుండం RFCL ఎరువుల కర్మాగారం నిలిచిపోయిన కారణంగా రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణలోనికి తీసుకొని వెంటనే ఉత్పత్తి ఆరంభించేలా చర్యలకు ఉపక్రమించాలని కేంద్ర మంత్రులను కోరడంతో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వచ్చే 3, 4 రోజుల్లో యూనిట్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఈ పరిణామాలతో ఎరువుల లభ్యత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రానికి చేరిన 11,181 మెట్రిక్ టన్నుల యూరియా
శుక్రవారం రాష్ట్రానికి GSFC,IPL,CIL-కరాయికల్, CIL-కాకినాడ కంపెనీల ద్వారా 11,181 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రంలోని రైల్వే స్టాక్ పాయింట్లు కరీంనగర్, మిర్యాలగూడ, వరంగల్, పెద్దపల్లి ప్రాంతాలకు చేరిందని, శనివారం మరో 9,039 మెట్రిక్ టన్నులు MFL, KRIBHCO, CIL-క్రిష్ణపట్నం కంపెనీల నుంచి వరంగల్, సనత్ నగర్, కరీంనగర్ రైల్వే స్టాక్ పాయింట్లకు చేరుతుందని మంత్రి తెలిపారు. ఈ నెలలో కేవలం నాలుగు రోజుల్లోనే రాష్ట్రానికి 28,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందని వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,20,112 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, గత సంవత్సరం ఇదే సమయానికి 7,75,157 మెట్రిక్ టన్నుల అమ్మకాలు మాత్రమే జరిగాయని స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో మన కార్యదర్శి కేబినెట్ సెక్రటరీని కలసి వచ్చే 20 రోజుల్లో రోజుకు కనీసం 10 వేల మెట్రిక్ టన్నుల చొప్పున 2 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని గట్టిగా కోరినట్లు వివరించారు. రైతులు అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని, ఒకేసారి అధిక మొత్తంలో నిల్వ చేసుకోవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. యూరియా సరఫరా వేగవంతం చేయాలని కేంద్రాన్ని వరుసగా విజ్ఞప్తి చేస్తున్నామని, రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.






