- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడేళ్ల పంటల శాటిలైట్ మ్యాపింగ్ డేటా అందించాలి : మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ నాటికి యూరియా యాప్‌ను అమల్లోకి తేనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ నాటికి యూరియా యాప్‌ను అమల్లోకి తేనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఫెర్టిలైజర్ యాప్‌ను కేంద్ర ఫెర్టిలైజర్ శాఖ అభినందించిందని తెలిపారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, కో-ఆపరేషన్ , హార్టికల్చర్ శాఖల పురోగతిపై ఆయా శాఖల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం, తెలంగాణ విజన్ 2047 కార్యాచరణ ప్రణాళికలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలు రైతులకు పూర్తిస్థాయిలో చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఆర్గానిక్ పంటలు పండిస్తున్నప్పటికి, మార్కెట్లో నకిలీ ఆర్గానిక్ లేబుల్లతో నకిలీ ఉత్పత్తులు చలామణీ అవుతున్నందున నిజమైన ఆర్గానిక్ పంటలు పండించే రైతులకు నష్టం చేకూరుతుందన్నారు. ఇందుకోసం వ్యవసాయశాఖ ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చే విధంగా ఒక యాప్ తీసుకురానుందని చెప్పారు. ఈ యాప్ ద్వారా కొనుగోలుదారు తాను కొనబోయే ఉత్పత్తి ఎక్కడ, ఏ రైతు, ఎలా పండించాడో తెలుసుకుంటాడని, అగ్రివర్సిటీలలోని ఖాళీ ప్రదేశాలలో ఆర్గానిక్ పంటలు పండించి, అక్కడే స్టాల్స్ పెట్టి అమ్మినట్లైతే రైతులు ఆర్గానిక్ పంట వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
ఒక్క పైసా వృథాగా తిరిగి వెళ్లకూడదు..
రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా ఇప్పటికే రూ. 50 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ. 50 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రైతులకు కావాల్సిన యంత్రాలు మార్కెట్ ధరలకే లభించేలా, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా రైతులకు చేరేలా నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పట్టించుకోని కేంద్ర ప్రాయోజిత పథకాలను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ఆదేశాలనుసారం ఒకొక్కటిగా పునరుద్ధరిస్తోందని, అందులో భాగంగా ఈ సంవత్సరం వివిధ పథకాల కింద ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసా పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు వేసుకోవాలని, కేంద్రం నుంచి వచ్చే ఒక్క పైసా కూడా వృథాగా తిరిగి వెళ్లకూడదని అధికారులకు సూచించారు. వచ్చే ఖరీఫ్ నాటికి పెద్దమొత్తంలో యూరియా బఫర్ స్టాక్ లను నిల్వలో ఉంచుకోవాలని, భవిష్యత్తులో యూరియా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, రైల్వే రేక్ పాయింట్లను కూడా ఎరువుల పంపిణీకి తగ్గట్లుగా ఉండేలా, మరికొన్ని రైల్వే రేక్ పాయింట్లను అదనంగా ఏర్పాటు చేసేవిధంగా రైల్వే అధికారులను కోరాలని సూచించారు.
శాటిలైట్ మ్యాపింగ్ డేటా అందించాలి..
అధికశాతం ఖచ్చితత్వంతో శాటిలైట్ మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని, ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంటల శాటిలైట్ మ్యాపింగ్ డేటా రావాలని అధికారులను ఆదేశించారు. 3 సంవత్సరాల పంటల శాటిలైట్ మ్యాపింగ్ తో డేటా అందించాలని, డేటా ఫైనలైజ్ చేసేముందు ఒకసారి అధికారులతో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల డిపాజిట్లు ప్రైవేట్ కమర్షియల్ బ్యాంకులలో కాకుండా కో-ఆపరేటివ్ ,అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులలో చేసేలా చూడాలన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లో కేంద్రం ఇచ్చిన లక్ష్యానికి రెట్టింపు ప్లాంటేషన్ జరిగేలా అధికారులు పనిచేయాలన్నారు. తక్కువ పురోగతి ఉన్న ఆయిల్ పామ్ కంపెనీలను రద్దు చేసి, వాటిని ఆయిల్ ఫెడ్ సంస్థకు గాని, వేరే ఇతర కంపెనీలకు కేటాయించాలన్నారు. ఆయిల్ పామ్ కంపెనీలకు సంబంధించిన ఖాళీ ప్రదేశాల్లో మోడల్ పామ్ అభివృద్ధి చేసి, ఆయిల్ పామ్ రైతుల సందర్శనార్థం ఉంచితే, వారికి వచ్చే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలు ఉంటుందన్నారు. పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. దీంతో రైతులకు కూడా ఆయిల్ పామ్ పంట వేయాలనే కోరిక పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అవసరాల కోసం కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని, ఈ పరిస్థితి మారాలన్నారు. డిమాండ్ కు తగ్గట్టుగా కూరగాయల సాగును ప్రోత్సహించాలని, కూరగాయల సాగులో విజయవంతం అయిన రైతులను రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ఇతర రైతులతో మాట్లాడించాలి. గ్రామాలలోనే కాకుండా పట్టణాలలో కూడా అందుబాటులో ఉన్న స్థలాల్లో, టెర్రస్ ల మీద కూరగాయలు పండించేలా అవగాహన కల్పించాలన్నారు. రైతులకోసం డిపార్ట్ మెంట్లలో, యూనివర్సిటీలు, కార్పోరేషన్లలో ఏర్పాటు చేసే ప్రతి కమిటీలలో అధికారులతో పాటు రైతుల ప్రాతినిధ్యం వహించేలా కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా కమిటీలలో రైతుల ప్రాతినిధ్యం ఉండాలన్నారు. రైతు వేదికల దగ్గర సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని డిపార్ట్ మెంట్లకు సంబంధించి ఉన్న ఖాళీ ప్రదేశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి, ఉత్పత్తి అయి మిగిలిన కరెంట్ ను గ్రిడ్ కు అమ్ముకొవచ్చన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా రెండు రైతువేదికలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయగా, నెలకు 400 యూనిట్ల వరకు మిగులు కరెంటు ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, హర్టీకల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, హకా ఎండి చంద్రశేఖర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి ఇతర అధికారులు పాల్గొన్నారు.






