మరో రకంగా ఇది ఇబ్బంది పెట్టే చర్య: మంత్రి తుమ్మల

by Gantepaka Srikanth |

మరో రకంగా ఇది ఇబ్బంది పెట్టే చర్య: మంత్రి తుమ్మల

మరో రకంగా ఇది ఇబ్బంది పెట్టే చర్య: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మొంథా తుపాన్, అకాల వర్షాలకు సోయాబీన్, మొక్కజొన్న, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఈ పంటల కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, గిరిరాజ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ తెలంగాణలో 3,66,697 ఎకరాల్లో సోయాబీన్ సాగు చేయగా, సగటున దిగుబడి ఎకరాకు 7.62 క్వింటాళ్లుగా అంచనా వేశామన్నారు. కోత సమయంలో కురిసిన అకాల వర్షాల వల్ల పంటకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. వర్షాల ప్రభావంతో గింజల్లో రంగు మారడం, ముడతలు పడటం వంటి సమస్యలతో పంట ఎఫ్​ఏ క్యూ నిబంధనలకు అనుగుణంగా పంట రావడం లేదన్నారు. దీంతో సోయాబీన్‌పై ఎఫ్​ఏ క్యూ ప్రమాణాలను, ప్రత్యేక సందర్భంగా పరిగణించి సడలించాలని కోరారు. ఎన్​ఏఎప్​ఈడీ, ఎన్​సీసీఎప్​సంస్థలు సడలించిన నాణ్యత ప్రమాణాలకనుగుణంగా సోయాబీన్ కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు.

మొక్కజొన్న సాగు ప్రస్తుతం 6.74 లక్షల ఎకరాల్లో జరుగుతుండగా, 25 క్వింటాళ్ల సగటు దిగుబడితో సుమారు 16.85 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేశామన్నారు. మార్కెట్‌లో ధర క్వింటాళ్లకు రూ.1959కు పడిపోయి, కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.2400 రాకపోవడంతో రైతుల్లో ఆందోళన పెరగడంతో, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగి మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 48,757 మెట్రిక్​టన్నులు కొనుగోలు చేసి 14,519 మంది రైతులకు ప్రయోజనం కల్పించినట్లు వెల్లడించారు. పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ ప్రతిపాదించిన ఎకరాకు 7 క్వింటాళ్ల పరిమితి నిర్ణయం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు.

ఎల్​1, ఎల్​2, స్పాట్ బుకింగ్ విధానంలో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఇది మరో రకంగా ఇబ్బంది పెట్టే చర్యగా ఉందన్నారు. ఇప్పటికే మోంథా తుపాన్ ప్రభావంతో పత్తి పంట దెబ్బతిన్న పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తేమ శాతాన్ని సడలించాలని, అదేవిధంగా ఎకరాకు 11.74 క్వింటాళ్ల దిగుబడి ఆధారంగా కొనుగోలు కొనసాగించాలని పేర్కొన్నారు. రైతులకు కొనుగోలులో ఏర్పడుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు, దిగుబడి నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్షలాది చిన్న రైతులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం హస్తిన వెళ్లి సీఎం రేవంత్​రెడ్డిని కూడా ఈవిషయపై కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరడం జరిగిందని తెలిపారు.

Next Story