- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవరికీ ఆందోళన వద్దు.. ప్రతీ రైతును ఆదుకుంటాం: మంత్రి తుమ్మల భరోసా
ఖమ్మం నగరం ఏదులాపురం మున్సిపాలిటీ మధ్యలో నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు(Munneru Vagu)ను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) పరిశీలించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం నగరం ఏదులాపురం మున్సిపాలిటీ మధ్యలో నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు(Munneru Vagu)ను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండ్రోజులుగా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మున్నేరు 26 అడుగులకు చేరిందని.. ఇక పెరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. మున్నేరుకు ఎగువ నుంచి వస్తోన్న వరద క్రమంగా తగ్గుతోందని అన్నారు. మున్నేరు కరకట్టలు పూర్తయితే ఖమ్మం నగరానికి ఏ ఢోకా ఉండదని తెలిపారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏరియల్ సర్వే నిర్వహిస్తారని అన్నారు. ప్రస్తుతం తుపాన్ ప్రభావిత జిల్లాల్లో పంటనష్టం అంచనా జరుగుతోందని చెప్పారు. నష్టపోయిన రైతుల వివరాలు అన్నీ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
పశుసంపద, ఇళ్లు ఇలా ఏం నష్టపోయినా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. 4.5 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని తెలిపారు. రేపటి నుంచి క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ పంటనష్టం అంచనా వేస్తుందని అన్నారు. దీంతో పాటు మార్కెట్ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఆరబోసిన, కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పారు. పంటనష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తామని కీలక ప్రకటన చేశారు. కేంద్ర సహకరించినా, సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గతేడాది ఇలాగే భారీ స్థాయిలో పంటనష్టం జరిగిందని.. ఆ సమయంలో కూడా ఎటువంటి సాయం చేయలేదని గుర్తుచేశారు.






