రూ. 10 వేల పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం: మంత్రి తుమ్మల

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో గత నెలలో కురిసిన మొంథా తుఫాన్ కారణంగా 1,17,757 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ నివేదికను సమర్పించింది.

రూ. 10 వేల పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గత నెలలో కురిసిన మొంథా తుఫాన్ కారణంగా 1,17,757 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ నివేదికను సమర్పించింది. తుఫాన్ కారణంగా నష్టం వాటిల్లిన జిల్లాలలో పర్యటించిన వ్యవసాయశాఖ అధికారుల బృందం, దెబ్బతిన్న పంటల వివరాలను, సర్వే చేసి నివేదికను సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఒక ప్రకటనలలో పేర్కొంటూ రాష్ట్రంలో 33 శాతానికి పైగా పంట నష్టం జరిగిన వివరాలు సేకరించడం జరిగిందని, 27 జిల్లాలలోని 1,22,142 మంది రైతులకు చెందిన 1,17,757 ఎకరాలలో నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్​డిఆర్​ఎప్​ కింద ఇసుక మేటలకు రూ. 7285 ఎకరానికి, నీటిపారుదల కింద సాగైన పంటలకు ఎకరానికి రూ. 6880 , వర్షాధార పంటలకు రూ. 3440 తోటలకు ఎకరానికి రూ. 9106 చొప్పున మొత్తం రూ. 70 కోట్ల నిధులు రాష్ట్రానికి నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. గతంలో వరదలు సంభవించినప్పుడు కూడా కేంద్రం నుండి రాష్ట్రానికి ఎలాంటి సహాయం అందలేదని, ఈ పంట నష్టం వివరాలు కూడా కేంద్రానికి పంపి నిధులు అడుగుతామన్నారు. ఇప్పటికే మొంథా తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపాలని కోరినట్లు వెల్లడించారు. త్వరలోనే పంటనష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరానికి రూ. 10 వేలు పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.




Next Story