- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల సాయం తీసుకోండి.. ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడొద్దు: అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వ్యవసాయశాఖ, సీడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్, విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వ్యవసాయశాఖ, సీడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్, విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. వానాకాలం (ఖరీఫ్) 2026 సాగు సన్నాహకంలో భాగంగా, వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి విత్తనాల లభ్యతను కంపెనీల వారీగా, పంటల వారీగా సమీక్షించారు. రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలే అందుబాటులో ఉంచాలని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. వానాకాలం 2026లో రాష్ట్రంలో సుమారు 134.66 లక్షల ఎకరాల్లో సాగు జరిగే అవకాశముండగా, దానికి 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో 38.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అవసరానికి దాదాపు రెండింతలు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.
నాణ్యత విషయంలో రాజీ పడొద్దు..
గత సంవత్సరం వినియోగంతో పోలిస్తే ఈ సంవత్సరం అధిక నిల్వలు రైతులకు విశ్వాసాన్ని కలిగిస్తాయని మంత్రి పేర్కొన్నారు. హైబ్రిడ్ విత్తనాల లభ్యతపై ప్రత్యేకంగా చర్చిస్తూ, రైతుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలను ప్రాధాన్యంగా సరఫరా చేయాలని సూచించారు. విత్తనాల నాణ్యతపై ఎలాంటి రాజీ పడకూడదని, సీడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీడ్ కార్పోరేషన్ డెవలప్ మెంట్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, మార్క్ ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి మరియు వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.






