- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అపోహాలు సృష్టించవద్దు.. విపక్షాలకు మంత్రి తుమ్మల సూచన
రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్నట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష పార్టీ నేతలు చేసిన విమర్శలకు అర్థం లేదని రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్నట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష పార్టీ నేతలు చేసిన విమర్శలకు అర్థం లేదని రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ జగిత్యాల పీఏసీఎస్‌లో 890 బస్తాల యూరియా అందుబాటులో ఉందని, అక్కడ వేచి ఉన్న రైతుల సంఖ్య 80 కూడా దాటలేదన్నారు. సాయంత్రం వరకు ఎంతమంది రైతులు వచ్చిన, అందరికీ యూరియా బస్తాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కావాల్సినంత యూరియా అందుబాటులో ఉన్నా, సోసైటీ తెరిచే సమయం కంటే ముందే అక్కడకి వచ్చిన కొంతమంది రైతుల పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు వరుసలో పెడుతున్నారని పేర్కొన్నారు.
స్వప్రయోజనం కోసం వీడియో తీసి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే దానిని విపక్ష పార్టీల నాయకులు కుటిల రాజకీయాల కోసం వాడుకొని రైతులను ఆందోళనకు గురిచేయడం బాధాకరమన్నారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకేన్లు జారీ చేశారనడం కూడా అవాస్తవమని, కేవలం రైతుల ఎక్కువ సంఖ్యలో వచ్చినందుకు, పోలీసు సిబ్బంది ఒకరిద్దరు వస్తే వారే టోకెన్లు జారీ చేశారని, రైతాంగాన్ని ఆందోళనకు గురిచేయడం సరికాదన్నారు. గత యాసంగి కంటే ఈ యాసంగిలో ఇప్పటికే 1.91 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 1.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, ఇంకా 40 వేల టన్నుల యూరియా ఈ నెలలోనే పంపిణీ చేస్తున్నామన్నారు.
ఇదే కాకుండా మార్చినెలలో కూడా లక్షా 80 వేల మెట్రిక్ టన్నులు యూరియా సరఫరాకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కొందరు ఉద్దేశ్య పూర్వకంగా పాస్ బుక్కులు, చెప్పులు లైన్ లో పెట్టించి, యూరియా కొరత అనేది సృష్టించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగాన్ని ఆందోళన పరిచే ఇటువంటి ప్రయత్నాలను ఇప్పటికైనా మానుకోవాలని ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు. ఎక్కడైనా సరఫరాలో, పంపిణీలో నిజంగా సమస్య ఉంటే సంబంధిత వ్యవసాయాధికారులకు తెలియజేస్తే, యూరియా పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు.






