- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
రైతు నేస్తం కార్యక్రమంలో రైతులను భాగస్వాములను చేయడం ద్వారా అనేక విషయాలు, పథకాల గురించి తెలుసుకుంటారని, ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు నేస్తం కార్యక్రమంలో రైతులను భాగస్వాములను చేయడం ద్వారా అనేక విషయాలు, పథకాల గురించి తెలుసుకుంటారని, ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొట్ట మొదటిసారి విత్తన చట్టం ముసాయిదా బిల్లును రైతులకు వివరించామని, ఆ చట్టం ద్వారా రైతులకు కల్పించబడిన హక్కులు, వారి ప్రయోజనాలకు ఏ విధంగా భంగం కలుగుతుందో అనే విషయాలను తెలిపినట్లు చెప్పారు. మంగళవారం రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, కేంద్రం తీసుకొచ్చిన “విత్తన బిల్లు 2025” ముసాయిదాను రైతులకు వివరించారు. ఇదొక కొత్త అధ్యాయం అని, ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి విధానాలు ఏ ప్రభుత్వం తీసుకురాలేదని, రైతులకు వారి గురించి చేసే చట్టాలు తెలిసేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నెలకు రెండు, మూడు పర్యాయాలు రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో ప్రత్యక్షంగా ముచ్చటించే అవకాశం లభించిందని తెలిపారు. జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో భాగంగా 5500 క్వింటాళ్ల వరి విత్తనాలను 16 జిల్లాల్లోని రైతులకు 50 శాతం సబ్సిడీపై అందించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ పంటల్లో అంతర పంటల సాగు ఆవశ్యకత గురించి, వరి పంట కోత అనంతరం వరి కొయ్యలను కాల్చకుండా భూమిలో దున్ని పర్యావరణాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
పంట అవశేషాలను కాల్చడంతో కలిగే దుష్పరిణామాలను గ్రామగ్రామాన తిరిగి అధికారులు విస్తృత అవగాహన కల్పించాల్సిందిగా ఆదేశించారు. పంట అవశేషాల లేదా వ్యర్థాల నిర్వహణపై ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. గత ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించి, వాటిని నిరూపయోగంగా వదిలేసిందని, కాని మా ప్రభుత్వం ఏర్పడగానే, రైతు వేదికలలో దృశ్య, శ్రావణ మాద్యమాలను ఏర్పాటు చేసి, వాటిని రైతుల కోసం ఉపయోగిస్తున్నట్టు మంత్రి తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమంలో కూడా వివిధ జిల్లాలలోని రైతు వేదికల నుండి దాదాపు 30 వేల మంది రైతులు హాజరయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి విత్తన బిల్లు 2025 ను మరింత సమర్థవంతంగా సమగ్రంగా రూపొందించేలా పలు సూచనలు చేశారు. రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు సునీల్ ఇంతకు ముందు ఉన్న, కొత్తగా తీసుకురాదలచిన చట్టాలపై రైతులకు వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, వ్యవసాయ సంచాలకులు గోపి , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.
ప్రారంభం కానీ జిన్నింగ్మిల్లులు వెంటనే తెరవాలి :
రాష్ట్రంలో ఇంకా ప్రారంభం కాని జిన్నింగ్ మిల్లులను వెంటనే ప్రారంభించవలసిందిగా వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, సీసీఐ అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా 328 జిన్నింగ్ మిల్లులు నోటిఫై చేసినప్పటికీ, వాటిలో కొన్ని ఇప్పటికీ కొనుగోళ్లు చేపట్టకపోవడంపై మండిపడ్డారు. జిన్నింగ్ మిల్లర్లు సమ్మె విరమించి మిల్లులన్నీ ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ, ఇంకా కొన్నిచోట్ల మిల్లులు పనిచేయకపోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌తో మాట్లాడి మిగిలిన మిల్లులన్నీ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా పత్తి కొనుగోళ్లు నిరంతరంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ఇప్పటికే 1.32 లక్షల మంది రైతుల నుండి 2.35 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి సేకరించామని కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలన్నారు.






