- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రానికి కేటాయించిన యూరియాను కేంద్రం సరఫరా చేయాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
రాష్ట్రంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని, కేంద్రం వెంటనే రాష్ట్రానికి తగినంత యూరియా సరఫరా చేయాలని

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని, కేంద్రం వెంటనే రాష్ట్రానికి తగినంత యూరియా సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మంగళవారం కేంద్ర మంత్రి జెపి నడ్డా లేఖకు జవాబిస్తూ ఈ నెలలో ధాన్యం, పత్తి, మక్క వంటి పంటలకు యూరియాను ఎక్కువగా వాడుతారని, ఇలాంటి పరిస్థితులలో యూరియా సరఫరాలో ఎలాంటి ఆలస్యం తలెత్తిన పంటల దిగుబడులపై తీవ్రమైన ప్రభావం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 1.09 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆగస్టు నెలలో పంటల అత్యధిక యూరియా వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతోందని అంచనా చేసినట్లు తెలిపారు. గత ఏప్రిల్ 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు రాష్ట్రానికి 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 4.51 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా మాత్రమే జరిగిందన్నారు.
ఇదే సమయంలో ఏప్రిల్ ప్రారంభం నాటి నిల్వలు కూడా వాడుకొని 5.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు విక్రయించడం జరిగిందని తెలిపారు. కేంద్రం ఆగస్టు నెలకు రాష్ట్రానికి 1.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించి, అందులో 1.31 లక్షల మెట్రిక్ టన్నులు దేశీయంగా, 0.39 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో దిగుమతిగా రావాల్సిన యూరియాకు సంబంధించి షిప్ మెంట్ వివరాలు ఇంకా రాలేదన్నారు. అంతేకాకుండా దేశీయ సంస్థలైన పీపీఎల్నుండి 11 వేల మెట్రిక్ టన్నులు, ఎంసీఎఫ్ఎల్నుండి 7 వేల మెట్రిక్ టన్నులు ఆగస్టులో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, వారు సరఫరా చేయలేమని తెలియజేసినట్లు పేర్కొన్నారు.
ఏప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఉందని, ఈ విషయంలో కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జెపి నడ్డాను లేఖ ద్వారా కోరారు. అదేవిధంగా ఈ ఆగస్టులో సరఫరా చేయలేమని చెప్పిన పీపీఎల్, ఎంసీఎఫ్ఎల్తో ఏర్పడిన 18 వేల మెట్రిక్ టన్నుల కొరతను ఆర్ఎప్సీఎల్ద్వారా భర్తీ చేయాలన్నారు. ఆగస్టు నెలలో కేటాయించిన విధంగా రాష్ట్రానికి దిగుమతి ద్వారా అందాల్సిన 39,600 మెట్రిక్ టన్నుల యూరియాను ఈ నెల 20వ తేదీకి ముందు రాష్ట్రానికి చేరే నౌకల ద్వారా ఇవ్వాలని, దీంతో పాటు ఏప్రిల్ నుండి జూలై మధ్య ఏర్పడిన 2.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరతను కూడా ఆగస్టు నెలలో మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగు అవుతున్న పంటలకు యూరియా లభ్యత నిరవధికంగా ఉండేలా చూసేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.






