- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్‌ల పంపిణీ.. జిల్లాకు 10 అందజేత : మంత్రి తుమ్మల
రైతుల కోరిక మేరకు ఆధునిక సాంకేతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ డ్రోన్‌లు సబ్సిడీపై అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రైతుల కోరిక మేరకు ఆధునిక సాంకేతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ డ్రోన్‌లు సబ్సిడీపై అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రాష్ట్రంలో యాంత్రికరణను వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సబ్ మిషన్ అగ్రికల్చర్ మెకనైజేషన్(SMAM) పథకం కింద పలు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ మొదటి దశలో ప్రతి జిల్లాకు 10 చొప్పున వ్యవసాయ డ్రోన్లను 40 శాతం సబ్సిడీతో, గరిష్టంగా రూ.4 లక్షల వరకు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలకు అందచేయడానికి నిర్ణయించినట్లు వెల్లడించారు. వ్యవసాయ డ్రోన్ల వినియోగంతో పిచికారీ సమయం 70–80 శాతం వరకు తగ్గడంతో పాటు ఎరువులు, సూక్ష్మపోషకాలు సమానంగా పంటపై పిచికారీ చేయడం సాధ్యమవుతుందని, కూలీల ఖర్చు తగ్గి రైతులకు లాభం పెరుగుతుందన్నారు.
సంఘాలకు డ్రోన్ల సబ్సిడీ..
డ్రోన్లను సబ్సిడీపై సంఘాలకు అందజేయడం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించబడిన డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడం ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వం ఒకవైపు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూనే, ఉద్యానవన పంటల అభివృద్ధి కోసం పసుపు ఉడకపెట్టే, పసుపు పాలిషింగ్ యంత్రాలు, ఆయిల్ పామ్ కోతకు టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల్, ఇతర ఉద్యానవన పంటల కోత పరికరాలను కూడా సబ్సిడీ పథకంలో చేర్చిందన్నారు. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, సబ్సిడీ శాతం దరఖాస్తు విధానం వంటి వివరాలు జిల్లా వ్యవసాయ కార్యాలయాలలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. 2025–26 సంవత్సరంలో ఇప్పటివరకు 9936 వ్యవసాయ యంత్రాలను రూ.28.74 కోట్ల సబ్సిడీపై రైతులకు అందచేయడం జరిగిందన్నారు. రానున్న 10 నుంచి 15 రోజుల్లో మిగతావన్నీ రైతులకు అందచేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.






