పెండింగ్ యూరియాను ఈనెల కేటాయింపులో సరఫరా చేయాలి: మంత్రి తుమ్మల

by Ajay Maddhiboyina |

రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే సరఫరా చేయాలని పార్లమెంట్ లో కేంద్ర మంత్రులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు.

పెండింగ్ యూరియాను ఈనెల కేటాయింపులో సరఫరా చేయాలి: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే సరఫరా చేయాలని పార్లమెంట్ లో కేంద్ర మంత్రులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. బుధవారం బీసీలకు 43 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నాకు హాజరైన అనంతరం కేంద్ర మంత్రులు నడ్డా, నిర్మలా సీతారామన్ ​కలిశారు. ఆ సందర్భంగా ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు యూరియా సరఫరాలో ఏర్పడిన లోటును కూడా ఆగస్టు నెల కేటాయింపులతో పాటే సరఫరా చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 1.09 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సరఫరాలో ఆలస్యం తలెత్తితే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని వారికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెలకు రాష్ట్రానికి 1.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని తక్షణమే సరఫరా చేయాలన్నారు.

ఏప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ యూరియాను కూడా ఆగస్టు నెల కేటాయింపులతో పాటే వెంటనే సరఫరా చేయాలన్నారు. అదేవిధంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి, క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని మార్చి 2018 లో ఉన్నట్టుగా 44 శాతానికి పెంచాలని కోరారు. క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుండి 16.5 శాతం తగ్గించడంతో ఆయిల్ పామ్ గెలల ధర తగ్గడంతో పాటు , ఇది ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహకానికి అడ్డంకిగా మారనుందని తెలిపారు. గతంలో దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుండి 44 శాతానికి పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరినట్లు గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకమైన ఎన్​ఎంఈఓ –ఓపీ పథకంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆయిల్ ప్లాంటేషన్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకోసం చేస్తున్న కార్యక్రమాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని వివరించారు.

Next Story