సీడ్ హబ్‌గా తెలంగాణ.. 60 శాతం విత్తనం ఇక్కడి నుంచే సరఫరా

by Ajay Maddhiboyina |

ఇండియా, ఆఫ్రికా దేశాలకు వ్యవసాయ రంగమే ప్రధాన ఆదాయ వనరు అని,ఈ రంగంలో అధిక దిగుబడి ఇచ్చే, నాణ్యత గల విత్తనాలను అభివృద్ధికి కలిసి పనిచేయడం ఎంతో అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

సీడ్ హబ్‌గా తెలంగాణ.. 60 శాతం విత్తనం ఇక్కడి నుంచే సరఫరా
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇండియా, ఆఫ్రికా దేశాలకు వ్యవసాయ రంగమే ప్రధాన ఆదాయ వనరు అని,ఈ రంగంలో అధిక దిగుబడి ఇచ్చే, నాణ్యత గల విత్తనాలను అభివృద్ధికి కలిసి పనిచేయడం ఎంతో అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. గురువారం ఇండియా–ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2025 కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ భారత్–ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయరంగంలో సంబంధాలను బలోపేతం చేసే వేదికగా ఈ సమ్మిట్ నిలుస్తోందని పేర్కొన్నారు. వాణిజ్యంపై కాకుండా, సీడ్ డిప్లొమసీ పెంపొందించడం, శాస్త్ర పరిజ్ఞానం పంచుకోవడం భవిష్యత్తులో పరస్పరం కలిసి పనిచేయడం కోసం ఈ వేదిక ఒక వారధిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

భారతదేశం గ్రీన్ రివల్యూషన్ ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధి సాధించిందని, ఆ విజయానికి నాణ్యమైన విత్తనమన్నారు. నాణ్యమైన విత్తనమే లేకపోతే పంట లేదని, రైతు ప్రగతి సాధ్యం కాదు అని అన్నారు. ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి పంటలు పండుతున్నప్పటికీ, అనేక మంది రైతులు ఇప్పటికీ వాళ్లు దాచుకొన్న పంటలో కొంత ధాన్యాన్ని విత్తనముగా వాడుతున్నారన్నారు. ఇది ఉత్పాదకతను తగ్గించే అంశమని ఆఫ్రికా దేశాలకు సస్యశ్యామలమైన నేలలు, అనుకూల వాతావరణం ఉన్నందున సరైన సమయంలో సరైన విత్తనం అక్కడ రైతులకు అందించడం అత్యవసరమని పేర్కొన్నారు.

దేశంలో 60 శాతం విత్తనాలు తెలంగాణ సరఫరా :

తెలంగాణ భారతదేశపు సీడ్ హబ్ గా మారిందని, దేశ అవసరాల్లో 60 శాతం విత్తనాన్ని తెలంగాణ నుంచే సరఫరా చేయడమే కాకుండా, 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని అన్నారు. 1000 పైగా విత్తన కంపెనీలు, ఆధునిక పరిశోధన, ప్రాసెసింగ్, నిల్వ సదుపాయాలతో పాటు కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో తెలంగాణ విత్తనాలకు గ్లోబల్ గుర్తింపు లభించిందని అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు భరోసా రైతుల ఖాతాలో నేరుగా సబ్సిడీ జమ చేయడం ద్వారా, రైతు తనకు నచ్చిన నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు.

ఈ విధానం ద్వారా పారదర్శకత పెరిగి, రైతును శక్తివంతంగా మార్చడానికి దోహదం చేస్తుందని వెల్లడించారు. ఆఫ్రికా దేశాలు కూడా ఇలాంటి విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నాణ్యమైన విత్తనాల వినియోగం పెరిగి ఉత్పాదకత, ఆహార భద్రత గణనీయంగా మెరుగుపడుతుందని సూచించారు.ఆఫ్రికా విత్తన మార్కెట్ విలువ దాదాపు యుఎస్ డి 3.99 బిలియన్ గా ఉందని, భారత్, ఆఫ్రికా భాగస్వామ్యం ద్వారా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, రైతులు, పరిశోధకులు, విత్తన సంస్థలు కలిసి లాభపడవచ్చని అభిప్రాయపడ్డారు.

Next Story