తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో లెన్స్‌కార్ట్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లజోడు తయారీ కేంద్రాన్ని రూ.1500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో లెన్స్‌కార్ట్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లజోడు తయారీ కేంద్రాన్ని రూ.1500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సమీపంలో రావిర్యాల నాన్-సెజ్ జనరల్ పార్క్‌లో ప్రారంభమయ్యే ఈ ప్లాంట్‌కు 50 ఎకరాలు కేటాయించామన్నారు. ఇక్కడ కళ్ల జోడు ప్లాంట్​ఏర్పాటు ద్వారా సుమారు 1600 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. గురువారం తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి లతో కలిసి ఈ ప్లాంట్‌కు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్​బాబు మాట్లాడుతూ.. లెన్స్ కార్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద కళ్లజోడుల తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం అని దీంతో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం అవుతుందన్నారు.

రెండేళ్లలోనే ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, నాలుగేళ్లలోనే పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, లెన్స్‌కార్ట్ మధ్య గతేడాది 2024 డిసెంబర్ 8న ఎంవోయూ కుదిరిందన్నారు. ఇప్పటికే లెన్స్‌కార్ట్‌కు రాజస్థాన్‌లో అధునాతన కళ్లజోడు తయారీ యూనిట్‌ ఉన్నప్పటికీ.. మన దగ్గర ఏర్పాటు కాబోయే ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్ అని చెప్పేందుకు సంతోషిస్తున్నామన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ తెలంగాణకు తలమానికం అవుతుందన్నారు. కళ్ల జోడు తయారీ రంగంలో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లడం ఖాయమన్నారు. ఇక్కడ తయారయ్యే కళ్ల జోడు ఉత్పత్తులు జపాన్, సింగపూర్, థాయ్‌లాండ్, తైవాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, యూఏఈ, సౌదీ అరేబియా దేశాలకు ఎగుమతి అవుతాయని మంత్రి శ్రీధర్​బాబు వెల్లడించారు.

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూ తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి శ్రీదర్​బాబు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల పరిస్థితులున్న క్రమంలోనే లెన్స్‌కార్ట్ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. లెన్స్​కార్డుతో పాటు ఇతర పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టి "తెలంగాణ రైజింగ్"లో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, లెన్స్ కార్ట్ ప్రతినిధులు చౌదరి, సుమిత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story