మేమేం అడవులను నరకలేదు.. జంతువులను చంపలేదు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు కౌంటర్

by Gantepaka Srikanth |
మేమేం అడవులను నరకలేదు.. జంతువులను చంపలేదు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: హెచ్‌సీయూ భూముల(HCU Lands)పై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెచ్‌సీయూలో తామేం పర్యావరణ విధ్వంసం చేయడం లేదని అన్నారు. అక్కడ తాము అడవులను నరికామని, జంతువులను చంపామని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. రాష్ట్రంలో అడవులను పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం కంచ గచ్చిబౌలి భూముల వివాదం కోర్టు పరిధిలో ఉందని అన్నారు. వాస్తవాలను కోర్టుకు తెలియజేస్తామని చెప్పారు. కంచ గచ్చిబౌలిలో అటవీ భూమి లేదని స్పష్ట చేశారు. ఆ భూముల్లో వివిధ సంస్థలు ఉన్నాయని అన్నారు.

ఇదిలా ఉండగా.. హర్యానాలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పర్యవరణాన్ని విధ్వంసం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ బిజీగా ఉందని విమర్శించారు. 'అడవులపై బుల్డోజర్లను పంపుతుంది. ఇది కాంగ్రెస్ మోడల్' అని ఎద్దేవా చేశారు. 'ప్రకృతి, జంతువులకు నష్టం జరిగితే ప్రమాదం. అటవీ భూముల్లో బుల్డోజర్లు నడుపుతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు నమ్మకద్రోహం జరుగుతుంది' అని మోడీ విమర్శించారు.

మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మోడీ విమర్శలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం స్పందించారు. 'హెచ్‌సీయూపై జరుగుతున్న అవాస్తవ ప్రచారం గురించి ప్రధాని మోడీకి తెలియనట్లు ఉంది. కంచె గచ్చిబౌలి భూమి వివాదం సుప్రీంకోర్టులో ఉంది. వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ సర్కార్‌పై మోడీ మాట్లాడుతున్నారు' అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

Next Story

Most Viewed