- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sridhar Babu: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం
మతాన్ని అడ్డు పెట్టుకొని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మతాన్ని అడ్డు పెట్టుకొని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ఆదివారం కోకాపేట్‌లోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి.. అక్కడి రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమది బుల్డోజర్ సంస్కృతి కాదని, కబ్జాకోరుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడటం చూసి ఓర్వలేకే కొందరు కావాలనే బురద జల్లుతున్నారని విమర్శించారు. బాపూ ఘాట్ అభివృద్ధి విషయంలో ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని స్థానికులకు విజ్ఞప్తి చేశారు.
కోకాపేట్‌లోని శ్రీ శారదా పీఠం భూముల వ్యవహారంలో సమాచార లోపం వల్లే గందరగోళం తలెత్తిందని స్పష్టం చేశారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని.. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్నిరకాలుగా అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని.. తప్పులు దొర్లితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. శారదా పీఠం భూముల విషయంలో జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం
ఆపదలో ఉన్న వారికి చేసే రక్తదానం ప్రాణదానంతో సమానమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. నేటితరం యువత సామాజిక స్పృహతో రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఎస్ఎస్ఎస్ యువ సేన ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అత్యవసర ఆపరేషన్ల సమయంలో రక్తం సకాలంలో అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ముఖ్యంగా తలసేమియా వంటి వ్యాధులతో బాధపడే చిన్న పిల్లలకు ప్రతినెలా రక్తం ఎక్కించడం వారి భారంగా మారిందన్నారు. ఇలాంటి తరుణంలో మనమిచ్చే ఒక యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను నిలబెడుతుందన్నారు.






