కృష్ణా, మంజీరా, గోదావరి జలాలు నగరానికి తెచ్చిందే కాంగ్రెస్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

నగరానికి కృష్ణా జాలాలు, మంజీరా, గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతోందని మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

కృష్ణా, మంజీరా, గోదావరి జలాలు నగరానికి తెచ్చిందే కాంగ్రెస్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘హైదరాబాద్ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. జనాభా కూడా పెరుగుతోంది. కానీ జనాభా కనుగుణంగా తాగునీటి సరఫరా లేదు. గతంలో నగరానికి కృష్ణా జాలాలు, మంజీరా, గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతోంది. మార్పు అంటే ఇదే కదా.. అది మాతో సాధ్యం’ అని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. గోదావరి తాగునీటి ప్రాజెక్టు 2, 3 దశలు, కోకాపేట్ నియోపోలీసు లేఅవుట్ తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి కోకాపేట నియో పోలీస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ను సైతం ప్రారంభించారు. అనంతరం గండిపేట(ఉస్మాన్ సాగర్)లో రాజేంద్ర‌నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గోదావరి, కృష్ణా, మంజీరా జలాలను ఇక్కడికి తీసుకొచ్చిందని గుర్తు చేశారు.

పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జంటనగరాల వాసులకు తాగునీటికి ఇబ్బంది కలగకుండా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని, ఇదే మార్పునకు సంకేతమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేలా అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నామని, వాటిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, భావితరాల కోసమే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని తెలిపారు.నగరవాసులకు అంతర్జాతీయ జీవన ప్రమాణాలను అందించాలన్నదే మా సంకల్పమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి, మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహ్మారెడ్డి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్, ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఎండీ నరసింహ్మారెడ్డి, ఎమ్మెల్యేలు, ఆయా కార్పొరేషన్ల చైర్మెన్లు పాల్గొన్నారు.

Next Story