- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేకిన్ ఇండియా’ కాదు..‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’నే మా నినాదం, లక్ష్యం: శ్రీధర్ బాబు
‘మేకిన్ ఇండియా’ కాదు, ‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’ అన్నదే మా ప్రభుత్వ నినాదం, లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మేకిన్ ఇండియా’ కాదు, ‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’ అన్నదే మా ప్రభుత్వ నినాదం, లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని, తెలంగాణను ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. హైటెక్స్ లో ‘ది ఫెడరేషన్ ఆప్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ టీసీసీఐ)’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘ఇండస్ర్టియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్ పో ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలంగాణ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కంపౌండ్ మంత్లీ గ్రోత్ రేటు 2.9 శాతంగా ఉందని, అదే జాతీయ సగటు 0.52 శాతం మాత్రమే ఉందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇలా ఆరు రేట్లు తెలంగాణలో అధికంగా నమోదయ్యిందని 2024-25లో ఇండస్ట్రియల్ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ (జీఎస్ వీఏ) రూ.2.77 లక్షలకు చేరిందని తెలిపారు. ఇంధన వినియోగంలో 15.6 శాతం, జీఎస్టీ వసూళ్లలో 9.8 శాతం, పే రోల్ ఎన్ రోల్ మెంట్స్ లో 13.9 శాతం వృద్ధి రేటు నమోదయ్యిందని ఈ సందర్భంగా వివరించారు.
ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ కేంద్రంగా ప్రత్యేక జోన్లు
‘తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ కొందరూ విష ప్రచారం చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంలోనే రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చాం. ఒక్క లైఫ్ సైన్సెస్ రంగంలోనే రూ.40వేల కోట్ల పెట్టుబడులొచ్చాయి. కొత్తగా 150 కొత్త ప్రాజెక్టులు మొదలయ్యాయి. 51వేల మంది ప్రత్యక్షంగాను , మరో 1.5 లక్షల మందికి పరోక్షంగాను ఉపాధి అవకాశాలు లభించాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, లైఫ్ సైన్సెస్ సిటీ, గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ను అభివృద్ధి చేస్తున్నాం. పారిశ్రామికాభివృద్ధి వికేంద్రీకరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. అవుటర్ రింగ్ రోడ్డు లోపల టెక్నాలజీ, సర్వీసెస్ జోన్, అలాగే ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య మ్యానుఫాక్చరింగ్ జోన్, ఆర్ఆర్ఆర్ బయట వ్యవసాయ, గ్రామీణ ఇన్నోవేషన్ జోన్ ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం’ అని
మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తాము అయిదేళ్ల కోసం ప్రణాళికలు రూపొందించడం లేదని, రాబోయే తరాల కోసం ఆలోచిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పునరుద్ఘాటించారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్య సాధనలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకొచ్చిన టోనీ బ్లెయిర్ ఇన్సిట్యూట్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని వెల్లడించారు. ఇలా రాష్ట్రాభివృద్ధిలో కలిసొచ్చే వారందర్నీ కలుపుకుని ముందుకెళ్తామన్నారు.
జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈల వాటా 10 శాతానికి పెరిగేలా
‘దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల బలోపేతంపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని శ్రీధర్‌బాబు అన్నారు. గత 18 నెలల్లో కొత్తగా 15వేల ఎంఎస్ఎంఈలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మన జీఎస్ డీపీలో ఎంఎస్ ఎంఈల వాటాను 10 శాతానికి పెంచేలానే సంకల్పంతో గతేడాది ప్రత్యేక పాలసీకి రూపకల్పన చేశామని ఆయన వెల్లడించారు. ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, వీటిల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ టీసీసీఐ అధ్యక్షుడు డా.సురేష్ కుమార్ సింఘాల్, సీనియర్ ఉపాధ్యక్షుడు ఆర్. రవి కుమార్, ఉపాధ్యక్షుడు కేకే మహేశ్వరి, ఐఐటీఈఎక్స్ 2025 కన్వీనర్ విమలేష్ గుప్తా పాల్గొన్నారు.






