సంగీతానికి, పాటకు ఎల్లలు లేవని నిరూపించిన స్వర మాంత్రికుడు: మంత్రి శ్రీధర్‌బాబు

by Gantepaka Srikanth |

సంగీతానికి, పాటకు ఎల్లలు లేవని నిరూపించిన స్వర మాంత్రికుడు: మంత్రి శ్రీధర్‌బాబు

సంగీతానికి, పాటకు ఎల్లలు లేవని నిరూపించిన స్వర మాంత్రికుడు: మంత్రి శ్రీధర్‌బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారతీయ సినీ సంగీత చరిత్రపై చెరగని సంతకం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ‘ది మ్యూజిక్ గ్రూప్ హైదరాబాద్’ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి సోమవారం లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతీయ 14 భాషల్లో.. 40 వేలకు పైగా పాటలు పాడి, పాటకు ఎల్లలులేవని నిరూపించిన స్వర మాంత్రికుడు అని కొనియాడారు. తరాలు మారినా, ఆయన పాట నిత్యనూతనంగా ప్రతీ తెలుగు హృదయాన్ని తట్టి లేపుతూనే ఉంటుందన్నారు. సంగీత ప్రపంచంలో రారాజుగా.. పాటల పల్లకిలో నెలరాజుగా.. అమర గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు.

కేవలం గాయకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా అలరించారన్నారు. తెరపై కనిపించే నటులే పాడుతున్నారా అని అనిపించేలా పాడటం ఆయనకు మాత్రమే సాధ్యమైందని చెప్పారు. నూతన కళాకారులను ప్రోత్సహించడంలో, కొత్త సంగీత పోకడలను స్వాగతించడంలో ఎప్పుడూ ముందుండేవారన్నారు. ఇప్పుడు ప్రారంభించుకున్నది కేవలం విగ్రహం మాత్రమే కాదని, అది సంగీతానికి, నిబద్ధతకు, వినయానికి ప్రతీక అన్నారు. కళలను ప్రోత్సహించేందుకు, కళాకారులను గౌరవించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రామచంద్రారావు, డా.కేఐ వరప్రసాద రెడ్డి, ఎస్పీ చరణ్, శుభలేఖ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story