ప్రపంచంలోనే హైదరాబాద్ మొదటి స్థానం: మంత్రి శ్రీధర్‌బాబు

by Gantepaka Srikanth |

ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలని ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు.

ప్రపంచంలోనే హైదరాబాద్ మొదటి స్థానం: మంత్రి శ్రీధర్‌బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలని ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. సెక్రెటేరియట్‌లో గురువారం యూఎస్ నేషనల్ కాలేజ్ వార్ బృంద సభ్యులతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలు, ఇక్కడి అనుకూలతలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీలు మంత్రి శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, ఏరోస్పేస్ కాంపోనెంట్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ, ఏఐ ఇన్ డిఫెన్స్, శాటిలైట్స్ సిస్టమ్స్ అండ్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్‌లో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నదని చెప్పారు. రాకెట్ల తయారీ నుంచి అత్యాధునిక డ్రోన్ల వరకు, యుద్ధ విమానాల విడిభాగాల నుంచి శాటిలైట్ల వరకు.. అన్నింటిలోనూ మేడిన్ తెలంగాణ మార్క్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నదని తెలిపారు. ఈ రంగంలో తెలంగాణ ఏటా 30 శాతానికి పైగా వృద్ధి రేటును నమోదు చేస్తున్నదన్నారు.

హైదరాబాద్ మొదటి స్థానం...

అలాగే.. 2024-26 మధ్య కాలంలో ఎగుమతుల్లో 103 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్(సీఏజీఆర్) నమోదైందన్నారు. లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, సాఫ్రాన్, ఎయిర్ బస్, డస్సాల్ట్ ఏవియేషన్ తదితర ప్రపంచ దిగ్గజ ఏరోస్పేస్ కంపెనీలతో డీఆర్డీవో, భెల్, మిధాని, బీడీఎల్,ఆర్ సీఐ, హాల్ తదితర కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఇవే కాకుండా ప్రిసిషన్ ఇంజినీరింగ్, డ్రోన్లు, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 1,500 కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ ఎఫ్‌డీఏ ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాస్ట్ ఎఫెక్టివ్ ఏరోస్పేస్ సిటీగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వరుసగా ఐదుసార్లు బెస్ట్ స్టేట్ ఫర్ ఏరోస్పేస్ అవార్డును గెలుచుకుని గ్లోబల్ ఏరోస్పేస్ మ్యాప్‌‌లో తెలంగాణ ఒక శక్తిమంతమైన కేంద్రంగా మారిందన్నారు. టీజీ ఐపాస్ ద్వారా 15 నుంచి 30 రోజుల్లోగా అనుమతులు.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఈ రంగానికి అవసరమైన రెడీ టూ స్కిల్ వర్క్ ఫోర్స్‌ను అందిస్తున్నామన్నారు. పెట్టుబడులకు మాత్రమే కాదు, సాంకేతికత, పరిశోధన, తయారీ, నైపుణ్యాభివృద్ధిలో అమెరికాకు ఒక నమ్మకమైన దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామిగా నిలిచేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు.

తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, రాబోయే రోజుల్లో ఆ దిశగా అడుగులు వేస్తామని అమెరికా-తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు చొరవ చూపుతామని స్టేట్ డిపార్ట్‌మెంట్ మినిస్టర్ కౌన్సిలర్ పాల్ నరైన్ తెలిపారు. ఈ సమావేశంలో కెప్టెన్ ఫ్రాంక్ ఒకటా(నేవీ), రెనో బామ్‌ఫోర్డ్(డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ), లెఫ్టినెంట్ కల్నల్ జాన్ కయాంగ్యాంగ్(ఆర్మీ), రెబెక్కా కింగ్(డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ), లెఫ్టినెంట్ కల్నల్ మైఖేల్ కూబ్(ఎయిర్ నేషనల్ గార్డ్), జోస్ సలాస్(డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏజెన్సీ), టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story