- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిజిటల్ సేఫ్టీలో తెలంగాణ మోడల్: మంత్రి శ్రీధర్ బాబు
డిజిటల్ సేఫ్టీలో తెలంగాణ మోడల్: మంత్రి శ్రీధర్ బాబు

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను డిజిటల్ సేఫ్టీలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్‌లోనూ కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్‌ను పొందుపరిచామని చెప్పారు. గురువారం హెచ్ఐసీసీలో నిర్వహించిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీ ఎస్‌సీ) కాంక్లేవ్ 2025ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు సవాల్ విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 265 మిలియన్లకు పైగా సైబర్ దాడులు జరిగాయన్నారు. తెలంగాణలోని కీలక రంగాలకు చెందిన సంస్థలు, కంపెనీలపై గతేడాది 17వేలకు పైగా రాన్సమ్ వేర్ దాడులు జరిగినట్లు ఓ ప్రముఖ సెక్యూరిటీ సంస్థ అధ్యయనంలో తేలిందన్నారు. ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఏడాది వ్యవధిలో రూ.800 కోట్లకు పైగా సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టడం వాస్తవ పరిస్థితికి నిదర్శనమన్నారు. ఇలాంటి తరుణంలో సంప్రదాయ పోలీసింగ్ కాకుండా స్మార్ట్ పోలీసింగ్ అవసరమని గుర్తుచేశారు.
పౌరుల భాగస్వామ్యంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట
పౌరుల భాగస్వామ్యంతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. మోసం జరిగిన తర్వాత కాకుండా ముందే స్పందించి సైబర్ నేరగాళ్లను కట్టడి చేసే వ్యవస్థ అవసరమన్నారు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ డేటా సిస్టమ్స్, రియల్ టైం మానిటరింగ్, ఓపెన్ ఇన్ఫర్మేషన్ లాంటి అధునాతన వ్యవస్థల ద్వారా తమ ప్రభుత్వం పౌరుల డిజిటల్ సేఫ్టీకి చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ.. వారిని వారియర్స్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) లారా విలియమ్స్, ఏడీజీపీ చారుసిన్హా, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఎస్ సీ ఎస్ సీ సెక్రెటరీ జనరల్ రమేష్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.






