ఆ భావం తెలపడమే బతుకమ్మ పండుగ ఉద్దేశం.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రజలకు, మహిళలకు మంత్రి సీతక్క(Minister Seethakka) బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆ భావం తెలపడమే బతుకమ్మ పండుగ ఉద్దేశం.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు, మహిళలకు మంత్రి సీతక్క(Minister Seethakka) బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీతక్క మాట్లాడుతూ.. మహిళా సోదరిమణులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు(Bathukamma Festival) చెప్పారు. పూలతో చెరువులను ప్రకృతిని దేవుని మొక్కుకునే పండుగ బతుకమ్మ అని చెప్పారు. దేవుడికి పూలు ఇష్టం.. అదేవిధంగా మహిళలు కూడా పూలను చాలా ఇష్టపడతారు. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు.. అక్కడ గౌరవింపబడతారు అని సీతక్క అన్నారు.

మన ఘనత ప్రపంచం మొత్తం తెలిసేలా, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయ్యేలా బతుకమ్మ పండుగను ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్నామని అన్నారు. ఈనెల 29 సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించబోయే బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమాజం రోజు రోజుకీ మారుతోంది. నాటి పరిస్థితులు నేడు లేవు.. నేటి పరిస్థితులు భవిష్యత్తులో ఉండవు. కానీ మన పూర్వీకులు ఆస్తి ఆస్తిత్వం మన పండుగలు, మన సంప్రదాయాలు, మన జీవన విధానం. ఆస్తులు అంతస్తులతో గుర్తింపు ఉండదు. బతుకమ్మ, బోనాలు తెలంగాణ ఆస్తిత్వం. కొంతమంది తామే బతుకమ్మను తెలంగాణకు నేర్పిస్తున్నామని ప్రచారం చేసుకున్నారని కల్వకుంట్ల కవితను ఉద్దేశించి సీతక్క విమర్శలుచేశారు.

బతుకమ్మ వెనక సైంటిఫిక్ రీసన్ ఉంది. ఎన్నో ఔషధ గుణాలున్న బతుకమ్మ పూలతో చెరువులు శుద్ధి అవుతాయి. తంగేడు, గునుగు, కట్ల పూలు యాంటీ బయోటిక్. పంటలిచ్చిన చెరువులను మొక్కుకోవడం బతుకమ్మ ఆచారం. తాగునీళ్లు కూడా గతంలో చెరువులు ఇచ్చేవి. చెరువులకు కృతజ్ఞతా భావం తెలపడమే బతుకమ్మ ముఖ్య ఉద్దేశం అని సీతక్క చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఆడబిడ్డలను తల్లిగారింటికి ఆహ్వానించుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు.

Next Story